జూబ్లీహిల్స్, జూన్ 11: ఆరోగ్య తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమవుతుందని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కాంతి వెస్లి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లోని ఆరోగ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ సీ ఎన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ఇ. అక్కేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులతో, సిబ్బందితో నిర్వహించిన అమ్మ మాట.. అంగన్వాడీ బాట ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం ఐసీడీఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. గర్భిణులకు పోషకాహారం అందివ్వడంతో పాటు వారు ఇంటి వద్ద ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచనలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పోషణ లోపం.. అతి పోషణ లోపం వున్న పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో మోగనున్న బడి గంట..
అంగన్వాడీ కేంద్రాలలో ఇకనుంచి బడి గంట మోగనుంది. ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న ఈ విధానాన్ని బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ ఆరోగ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఐసీడీఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీ ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంతో పాటు ప్లే స్కూల్ విద్య కోసం అన్ని కేంద్రాలకు అందిస్తున్న ఆట వస్తువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆరోగ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో పైలెట్ మెనూగా ఎగ్ బిర్యానీ ని ప్రారంభిస్తున్న ఐ సీ డీ ఎస్ డైరెక్టర్ కాంతి వెస్లి
అంగన్వాడీ కేంద్రాలలో వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ: డీడబ్ల్యూఓ అక్కేశ్వర్ రావు
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇకపై వారంలో రెండు సార్లు ఎగ్ బిర్యానీ పెట్టనున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 4 రోజులు ఉడికించిన కోడి గుడ్లు.. 2 రోజులు ఎగ్ కర్రీ తో భోజనం పెడతారు. అయితే ఇకనుంచి అంగన్వాడీ కేంద్రాలలో ప్లే స్కూల్ పిల్లలకు వారంలో 2 రోజులు ఎగ్ బిర్యానీ పెట్టనున్నారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ ఆరోగ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం లో భాగంగా మధ్యాహ్న భోజనం లో ఎగ్ బిర్యానీ పెట్టారు.