Arogya Prashasth | మేడ్చల్, అక్టోబర్13(నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని మానసిక, శారీరక లోపాలతో పాటు అభ్యాసన లోపాలను గుర్తించేందుకు విద్యాశాఖ ఆరోగ్య ప్రశస్త్ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటేనే అభ్యాసనపై శ్రద్ధగా చదివి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా లోపాలను గుర్తించి బాధిత విద్యార్థులకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రశస్త్ అనే యాప్‌ను విద్యాశాఖ వినియోగించనుంది. అయితే ఉపాధ్యాయులు తమ దగ్గర చదివే పిల్లలను పరీక్షించి వారిలోని లోపాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నారు. వీటి ఆధారంగా విద్యాధికారులు బాధిత విద్యార్థులకు సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే విద్యార్థుల లోపాలను గుర్తించే కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహిస్తున్న విషయం విధితమే.
యాప్‌లో నమోదు చేస్తారు ఇలా..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ సెల్ఫోన్లలో చేసుకున్న ప్రత్యేక యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న పాఠశాల, మొబైల్ నంబర్ ఐడీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.
ఆ తర్వాత విద్యార్థుల పేర్లు, ఒక్కొక్క విద్యార్థిని పరీక్షించి వివరాలను నమోదు చేస్తారు. ఉపాధ్యాయులు తమ సెల్ఫోన్లో విద్యార్థులకు సంబంధించి 64 ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ జవాబుల ఆధారంగా విద్యార్థుల లోపాలను గుర్తిస్తారు. జిల్లాలో ఉన్న పాఠశాలలో వచ్చే నెల నవంబర్ 14 వరకు విద్యార్థుల లోపాలను గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1789 ఉండగా 5,35 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి మండలానికి ఒక రిసోర్స్ పర్సన్‌ను ఎంపిక చేశారు. రిసోర్స్ పర్సన్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. రిసోర్స్ పర్సన్లు ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ మేరకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించగా విద్యార్థుల్లో లోపాలను గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి విజయకుమారి తెలిపారు.