శేరిలింగంపల్లి, డిసెంబర్ 22: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై నిలదీయడంతో ఓ బడా వ్యాపారవేత్త కుమారుడికి కోపం వచ్చింది. అదే కోపంతో తన కారుతో ప్రశ్నించిన వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు.. కారుతో ఢీకొట్టి, మహిళ మృతికి కారణమైన వ్యాపారి కుమారుడిని గురువారం అరెస్టు చేశారు. అతడి బెంజ్ కారును కూడా సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన దంపతులు సయ్యద్ సైఫుద్దీన్ జావీద్, మరియామీర్ ఓ ద్విచక్ర వాహనంపై, జావీద్ సోదరులు రషీద్ మిష్పా ఉద్దీన్, సయ్యద్ మినాజుద్దీన్ మరో ద్విచక్ర వాహనంపై ఈనెల 17వ తేదీ రాత్రి మాదాపూర్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి నలుగురు కలిసి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రెండు వాహనాలపై గచ్చిబౌలిలోని ఫుడ్ కోర్టుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఏఐజీ దవాఖాన సమీపంలో రోడ్డుపై డ్రైనేజీ నీరు పారుతుండటంతో ద్విచక్ర వాహనాలను నెమ్మదిగా డ్రైవింగ్ చేశారు.
వెనకనుంచి వేగంగా వచ్చిన ఓ బెంజ్‌కారు మురుగు నీటిలోంచి ముందుకు దూసుకువెళ్లింది. దీంతో రోడ్డుపై ఉన్న మురుగునీరు జావీద్ సోదరులపై పడింది. కారు ఆపకుండా.. నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన బెంజ్ కారును వెంబడించిన జావీద్ సోదరులు.. గచ్చిబౌలిలోని ఆట్రీమ్మాల్ వద్ద అడ్డుకున్నారు. ఒంటిపై ఉన్న మురుగునీటి దుస్తులు చూపిస్తూ.. కారు నడిపిస్తున్న వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. కనీసం సారీ కూడా చెప్పకుండా దూసుకురావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంజ్‌కారు నడిపిస్తున్న వ్యక్తి.. అదే కారుతో జావీద్ సోదరుల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో జావీద్, మరియామీర్ దంపతులు మరో ద్విచక్ర వాహనంపై బెంజ్ కారును వెంబడించారు. గచ్చిబౌలి కాసా షోరూం వద్ద యూ టర్న్ తీసుకుంటున్న బెంజ్‌కారును ఆపే ప్రయత్నం చేశారు.
జావీద్ ద్విచక్ర వాహనాన్ని సైతం ఢీకొట్టిన బెంజ్‌కారు డ్రైవర్.. వేగంగా కారును డ్రైవింగ్ చేస్తూ ఉడాయించాడు. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న జావీద్తో పాటు అతడి భార్య మరియా మీర్ (25) ఎగిరి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. జరిగిన సంఘటనపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరియా మీర్ బుధవారం మృతి చెందింది. నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కాకుండా కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బంజారాహిల్స్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమారుడు రాజసింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు గురువారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బెంజ్‌కారును సీజ్ చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.