మెహిదీపట్నం జూన్ 15: తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్, దక్షిణ ,పశ్చిమ మం డలం అదనపు డీసీపీ అష్వాక్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జంగయ్యలతో కలిసి దక్షిణ, పశ్చిమ మండలం ఇన్చార్జి డీసీపీ స్నేహమెహ్రా వివరాలను వెల్లడించారు. ఆసిఫ్‌నగర్‌లో నివసించే కుత్బుద్దీన్ అలియాస్ ఖుద్దూస్(22) గతేడాది ఆగస్టు 27 న ఆసిఫ్‌నగర్ జిర్రా వద్ద ఉన్న బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సయ్యద్ ముజాహిద్దీన్ అనే యువకుడితో గొడవ పడి హత్య చేశాడు. ఆసిఫ్‌నగర్ పోలీసులు కుత్బుద్దీన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన కుత్బుద్దీన్ సోదరుడి వద్ద ఫర్నిచర్ పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఆసిఫ్‌నగర్ కిషన్‌నగర్‌లో నివసించే ముజాహిద్దీన్ సోదరులు సయ్యద్ తాహెర్, సయ్యద్ ఇమ్రాన్ ,సయ్యద్ ముజఫర్లు తమ తమ్ముడిని చంపిన కుత్బుద్దీన్ను హత్యచేయాలని పథకం పన్నారు. ఈ నెల 13 గురువారం అర్ధరాత్రి తమ బావ సయ్యద్ అమన్, అతడి స్నేహితుడు షేక్ జావెద్ లతో కలిసి ఆసిఫ్‌నగర్‌లో పనులు ముగించుకుని వెళుతున్న కుత్బుద్దీన్ను వెంటాడి కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి పారిపోయారు. పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ఉదయం ఆసిఫ్‌నగర్ కిషన్‌నగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కత్తులతో పాటు, ఓ ద్విచక్రవాహనాన్ని, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.