సిటీ బ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతిఘటన ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల్లో రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన విధ్వంస కాండను నిలిపివేసి, హెచ్‌సీయూను ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా నిర్బంధం కొనసాగించడంపై విద్యార్థులు ఆగ్రహించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నార్త్ షాపింగ్ కాంప్లక్స్ నుంచి ఈస్ట్ క్యాంపస్ ద్వారా వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ చేపట్టిన ఆందోళనల్లో అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే భేషరతుగా కొట్టేయాలని కోరారు. క్యాంపస్‌లో ఉన్న వందలాది మంది పోలీసులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. పనులు నిలిపేసిన తర్వాత పోలీసులకు క్యాంపస్‌లో ఏం పని అంటూ ప్రశ్నించారు.
కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా యూనివర్సిటీలో నిర్బంధాలు కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హెచ్‌సీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు సహకరించాలని విద్యార్థులు కోరారు. యూనివర్సిటీ పరిధిలోని మొత్తం భూములకు యాజమాన్య హక్కులు సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడాలన్నారు. భూములన్నీ హెచ్‌సీయూ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులు పిల్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.
వర్సిటీ విద్యార్థుల ఫోన్లపై కాంగ్రెస్ సర్కార్ నిఘా ఉంచిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఐదు రోజుల పాటు యూనివర్సిటీ భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసకాండను బయటి వారికి చేరవేస్తున్నారనే నెపంతో తమ ఫోన్ సంభాషణలు వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను దేశద్రోహులు, ఉగ్రవాదుల్లా చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.