HCU | కొండాపూర్, మార్చి 13 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గురువారం యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున వర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి నెలకొంది అని ఎద్దేవా చేశారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఎకరానికి 50 వేల చొప్పున కేటాయించింది. కానీ ఈ భూమిలో అకాడమీ కార్యకలాపాలు కొనసాగించలేకపోవడంతో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి ప్రభుత్వ ఖజానా నింపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు టీజీఐఐసీ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్సీయూ భూముల వేలం మరోసారి తెరపైకి రావడంతో వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. భూములు వేలం వేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ జాతుల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు(రాక్స్) ఉన్నాయని వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం హెచ్ సి యు భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
హెచ్సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు https://t.co/CUgMlzH4tx pic.twitter.com/5iuBlnYtig
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025