HCT | సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : కొత్త సీసాలో పాత సారా అన్నట్లు ఎస్ఆర్డీపీ పథకాన్ని హెచ్సిటీగా మార్చిన రేవంత్ సర్కారు…గ్రేటర్లో ముఖ్య కూడళ్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేయక తప్పని పరిస్థితి. కేసీఆర్ ముద్రను లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి..పథకాల పేర్లను మాత్రమే మార్చి.. నాటి ప్రణాళికల్లో స్వల్ప మార్పులు చేసి ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు కట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది.
టెండర్ ప్రక్రియను ముగించి పనులు ప్రారంభించే లోపు కొందరు పర్యావరణవేత్తలు ఆందోళన చేసి.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ ప్రాజెక్టులు ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఆనంద్ విహార్ దగ్గర సొరంగ మార్గం తరహాలో కేబీఆర్ పార్కు చుట్టూ భూగర్భ సొరంగ మార్గంలోనూ అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలని భావించినా.. దక్కన్పీఠ భూమి ఐనా గ్రేటర్లో భారీ వ్యయం, అందులో కేబీఆర్ పార్కు కావడంతో సాధ్యాసాధ్యాలపై లోతైన అధ్యయనం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేవంత్‌రెడ్డి కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
దీంతో బీఆర్ఎస్ ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేసి.. అండర్ పాస్‌లను తెరపైకి తీసుకొచ్చారు. పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను రూ. 826 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు జంక్షన్లను హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు డిజైన్లను సైతం రూపొందించారు. రెండు దశల్లో టెండర్లు పిలిచి ఆరు జంక్షన్ల పనులు చేపట్టేందుకు బల్దియా సిద్ధమవుతున్నది.