సిటీబ్యూరో/హయత్‌నగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పోలీసులు తలుచుకుంటే చిన్న కొట్లాట కేసులో నిందితులైన వారికి స్టేషన్ బెయిల్‌కు అవకాశమున్నా.. అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు.. అదే ఎంత పెద్ద కేసైనా తమ వారు అనుకుంటే చట్టంలో ఉండే చిన్నపాటి లోపాలను ఆసరాగా చేసుకొని స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చు.. స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులలో నుంచి నిందితులను తొలగించడం, సెక్షన్లు తగ్గించేందుకు ప్రయత్నించి కొందరు పోలీసులు ఏసీబీకి పట్టుబడ్డ ఘటనలున్నాయి.
సమాజానికి చీడపురుగులా మారిన డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేసేస్తామంటూ ప్రభుత్వం ఒక పక్క చెబుతున్నా కొన్ని సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలు పోలీసు శాఖకు ఇబ్బందిగా మారుతున్నాయి. అందుకు డ్రగ్ స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘాను పెట్టి డ్రగ్స్ రవాణా, డ్రగ్స్ దందాలు, పబ్బులు, ఇతరాత్ర ప్రైవేట్ కార్యక్రమాల్లో డ్రగ్స్ వారే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
బీహార్, రాజస్థాన్ నుంచి గంజాయి చాక్లెట్లు, బంక్‌తో తయారు చేసిన చాక్లెట్లను హైదరాబాద్ శివారు ప్రాంతాలలో తెచ్చి విక్రయిస్తున్న ఘటనలున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఘటనలున్నాయి. అయితే తాజాగా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఇద్దరు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.