మలక్‌పేట, మార్చి 22: మలక్‌పేట పోలీసులు దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్‌వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న సాయిప్రసాద్‌ను విచారించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో నగదు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రూ. 38,73,500 నగదు, 43.11 లీటర్ల లిక్కర్, రూ. 1,18,799 విలువైన వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఇప్పటి వరకు రూ. 38 లక్షలు సీజ్ చేయగా, పోలీసులు రూ. 47,91,800 నగదుతో పాటు రూ. 19,06,089 విలువైన ఇతర వస్తువులను సీజ్ చేశారని వెల్లడించారు. ఇప్పటి వరకు 34 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రోనాల్డ్ రాస్ తెలిపారు.
చాదర్‌ఘాట్, మార్చి 22: నిబంధనలకు విరుద్ధంగా వాహనంలో తరలిస్తున్న రూ.49లక్షల నగదును ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదును తరలిస్తున్న ఇద్దరిని తదుపరి విచారణ నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం… చాదర్‌ఘాట్ పోలీసులు, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చాదర్‌ఘాట్ కాజ్వే బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. కాచిగూడ వైపు వెళ్తన్న ఓ కారును తనిఖీ చేయగా.. రూ.49లక్షల నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా రవి ప్రకాశ్ శర్మ, బొజ్జ సంజీవరావు నగదు తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించనున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
సుల్తాన్‌బజార్,మార్చి 22: బేగంబజార్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 31 లక్షలు పట్టుబడ్డాయి. నగదు తరలిస్తున్న హీరాలాల్ బిష్ణోయ్, ఆమ్రా రామ్ సావరామ్ దేవసీ, హనుమాన్ రామ్‌ను విచారించారు. హవాలా నగదుగా గుర్తించారు. ఈ నగదులను ఐటీ శాఖకు అప్పగిస్తామని బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
మలక్‌పేట: మలక్‌పేట పోలీసులు మూసారాంబాగ్ ఎస్బీఐ కాలనీ పార్కువద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారు డిక్కీలో తీసుకెళ్తున్న రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంజపూర్ నివాసి బొక్క సాయిచరణ్ కారులో నగదు తీసుకెళ్తూ మలక్‌పేట పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు.
సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా హవాలా పద్ధతిలో డబ్బులు తరలిస్తున్న ఇద్దరిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఆదిత్య గెహ్లోట్, రోహిత్ కలిసి అనుమానాస్పద స్థితిలో ద్విచక్ర వాహనంపై మైలార్‌దేవ్‌పల్లి లబ్బాయ్ కాంటా మీదుగా వెళ్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఓటీ బృందం నిందితులను ఆపి, తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వారి వద్ద రూ.17,40,100 నగదు లభించింది. నగదును హవాలా ద్వారా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.