అది అక్టోబర్ 1, మంగళవారం. మూసానగర్, శంకర్‌నగర్ కనుమరుగవుతున్న ఘటన. బుల్డోజర్లు, జేసీబీలు రాలేదు. రెడ్‌మార్క్‌తో వేలాడుతున్న ఇండ్లు మొత్తం 150. అప్పటి వరకు రెడ్ మార్క్ బోర్డులు తీసేయ్యాలని గొంతెత్తుతున్న స్థానికులు. కానీ ఆ రోజు రేవంత్ సర్కార్.. సుమారు 90 మంది కూలీలతో ఆపరేషన్ మూసీ చేపట్టింది. ఇండ్లపై కప్పులు తొలగించి గోడలను ధ్వంసం చేశారు. తమ ఇండ్లను కూల్చొద్దంటున్నా.. బలవంతంగా ఖాళీ చేయించి కూలుస్తున్నారంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ కూల్చివేతలు మూసీ బాధితులే స్వయంగా చేసుకున్నారు. వారి ఇండ్లను వాళ్లే కూల్చుకున్నారు. సర్కార్‌కు ఆ కూల్చివేతలతో సంబంధం లేదు.” ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ లెక్కన శంకర్‌నగర్, మూసానగర్‌లో అధికారులు వారి ఇండ్లపై రెడ్ మార్క్ వేసినప్పటి నుంచి నిద్ర లేని రాత్రులు గడపటం అబద్ధమా? ఎన్నో ఏండ్ల నుంచి నిర్మించుకున్న ఇండ్లను వాళ్లే స్వయంగా కూల్చుకున్నారనడం సమంజసమా? ఎవరి ప్రయోజనాల కోసం ఎవరిని బలి చేస్తున్నారు? అంటూ సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Operation Musi | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : మూసీ కూల్చివేతల వెనక సర్కార్ ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందా? జేసీబీలు, బుల్డోజర్లు రంగ ప్రవేశం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడే ప్రమాదం ఉందని ముందే ఊహించిందా? అందుకే ఆ బుల్డోజర్ను పక్కనపెట్టి లేబర్లను రంగంలోకి దించిందని రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఆ కూల్చివేతలు సర్కార్ ఖాతాలో పడకుండా చేతికి మట్టి అంటకుండా పనిఅయ్యేలా వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సుమారు 90 మంది లేబర్లను రంగంలోకి దించి వారితో మూసానగర్, శంకర్‌నగర్ ఇండ్లను కబలించింది. ఇందుకోసం వారికి అయిన ఖర్చు రూ. 2 లక్షల 40వేలు. ఇప్పుడు ఈ డబ్బులే అసలు వ్యూహాన్ని బయటపెట్టాయి. ప్రజలే సొంతంగా ఇండ్లను కూల్చుకుంటే కూలీలను పెట్టి డబ్బులు ఇచ్చింది ఎవ్వరు? ఎవరి ఖాతా నుంచి ఆ డబ్బులు లేబర్లకు చేరాయి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే ఆ లేబర్లకు డబ్బులు చెల్లించారని కొందరు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆ డబ్బులను తాము ఎందుకు భరించాలంటూ రెవెన్యూ వాళ్లే ఇవ్వాలంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. కూల్చివేతల శిథిలాలను తరలించేందుకు నేడో, రేపో అధికారులు టెండర్ ఖరారు చేయనున్నారు. సదరు ఏజెన్సీ నుంచే కూల్చివేతలకు డబ్బులు కేటాయించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ వద్ద ఫైల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
150 ఇండ్ల కూల్చివేతల్లోనే అధికారులు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రివర్ బెడ్లో ఉన్న మొత్తం 2,166 నిర్మాణాలను కూల్చివేయడం కుదురుతుందా అని అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన నిర్మాణాలు వాళ్లే కూల్చుకున్నారంటూ నెట్టేయడం కూడా సాధ్యం కాని దుస్థితి. ఇలాంటి సందర్భంలో మూసీ కూల్చివేతలు సాధ్యమవుతాయా? లేదా? అనే సందేహం సైతం అధికారులను వెంటాడుతుంది. కాగా, కూల్చివేతల ప్రక్రియ కోసం పర్యవేక్షించడానికి అధికారులు అన్ని శాఖల అధికారులతో టీంను ఏర్పాటు చేసింది. వాళ్లంతా రివర్ బెడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు. మిగిలిన చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్బంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక అధికారులు సతమతమవుతుండటం విశేషం.
మూసీ నిర్వాసితులు తమ ఇండ్లను కూల్చొద్దంటూ ఓ వైపు ఉద్యమిస్తూనే.. మరోవైపు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆలయాలపై సైతం రెడ్ మార్క్ వేశారంటూ పేట్లబుర్జు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టు నుంచి స్టేటస్ కో సైతం పొందారు. అధికారులకు సైతం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని న్యాయస్థానం సూచించినట్టు తెలిపారు. మరోవైపు మూసీ బాధితులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో సరైన వసతులు లేకపోవడంతో ఇప్పటికీ వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాలుగా జీవించిన వారికి ఒకే డబుల్ బెడ్ రూం కేటాయించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రివర్ బెడ్లో ఉన్న 2166 నిర్మాణాలను తొలగించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అందుకే ఈ ప్రక్రియకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. మరోవైపు కూల్చివేతలు తప్పవని చెబుతున్నప్పటికీ ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియని పరిస్థితి అధికారుల్లో ఉంది. అందుకే రోజుకు కొన్ని కుటుంబాలతో అధికారులు సమావేశమై బలవంతంగా ఒప్పిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.