సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 18: నిజాం రజాకార్ల దోపిడీ, అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ ఉద్యమకారులు చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం మహర్షి స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతి సందర్భంగా నిజాం కళాశాల నుంచి రవీంద్రభారతి వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వ కమిటీ తెలంగాణ ఆర్యసమాజ్ సభ్యులు డాక్టర్ డి. ధర్మతేజతో కలిసి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ… కుల, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమేనని చైతన్య పరిచేందుకు ఆర్య సమాజ్ను స్థాపించి ప్రపంచానికి వేదమే మూలం అని తెలిజేసిన మహోన్నతుడు మహర్షి దయానంద్ సరస్వతి అని కొనియాడారు. అనంతరం డి.ధర్మతేజ మాట్లాడుతూ… ప్రతి ఇంటిలో యజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టి 200 స్లమ్ ఏరియాలు, దళిత వాడల్లో సామూహిక యజ్ఞాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 200 యజ్ఞ కుండములతో బృహత్ యజ్ఞం, గో ఆధారిత ప్రాకృతిక వ్యవసాయం గూర్చి ప్రచారం చేయడంతో పాటు రైతులకు 200 మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి బ్రహ్మానంద ఆచార్యులు, మాజీ డీఎస్పీ నళిని ఆర్య, సూర్య ప్రకాశ్, వినయ్ ఆర్య, నరేంద్ర ఆర్య, రామచంద్ర రాజు, భరత్ ప్రకాశ్, ప్రదీప్ జాజు, భక్తరామ్తో పాటు 20 జిల్లాల ఆర్యసమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.