(మేకల సత్యనారాయణ/నాగిళ్ల యాదయ్య) ఎల్బీనగర్ / చంపాపేట, అక్టోబర్ 06: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పాలకులు హైదరాబాద్ నగరాన్ని కాంక్రిట్ జంగిల్‌గా మార్చేశారు. ఇలాంటి కాంక్రిట్ జింగిల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హరితహారం కార్యక్రమం ద్వారా విస్తృతంగా పలు కాలనీల్లో మొక్కలు నాటించారు.
ఇందులో భాగంగా ఎల్బీనగర్ సర్కిల్ చంపాపేట డివిజన్లోని సాయిరాంనగర్ కాలనీ పచ్చని చెట్లు, అందమైన పార్కులతో ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సాయిరాంనగర్ కాలనీ ఇన్నర్ రింగ్‌రోడ్డులో కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ప్రాంతం పక్కనే ఉంది. ఈ కాలనీలోని ఏ వీధులు చూసినా విశాలంగా,అందమైన మొక్కలతో ఆహ్లాదంగా ఉంటుంది. కాలనీలో 100 ఫీట్ల వెడల్పుతో కాలనీ వీధులు ఉన్నాయి.
సాయిరాం కాలనీ కేవలం పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కాపాడుకోవడంతో పాటుగా కాలనీవాసుల రక్షణపై కూడా కాలనీవాసులు దృష్టి సారించారు. కాలనీలో పోలీసులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలోని నాలుగు పార్కులను సుందరంగా తీర్చిదిద్దారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలనీలోనే ప్రగతి రిసార్ట్‌లో పనిచేసిన అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్డీవో రఘునాథ్‌రావు నివసిస్తున్నారు. దీంతో వారు ఈ కాలనీల్లో పార్కుల్లో ఔషధ మొక్కలను నాటించడంతో పాటుగా వాటి సంరక్షణ చేయిస్తున్నారు.
సాయిరాంనగర్ కాలనీని కాలనీ సంక్షేమ సంఘం ఐకమత్యంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ సమస్య వచ్చినా సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. కాలనీని అన్ని విధాలుగా పచ్చదనంగా తీర్చిదిద్దడంతో వారు కృషి చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పది. ఇప్పటికే హరితహారంతో కాలనీలు, బస్తీల్లో మొక్కలు నాటేలా ప్రేరేపిస్తున్నారు. హరితనిధి కోసం ఉద్యోగులు, వివిధ వర్గాల నుంచి నిధులు సేకరించడం చరిత్రాత్మక నిర్ణయం. పుడమితల్లి రుణాన్ని తీర్చుకునేందుకు ‘సేవ్ ఏ లైఫ్ స్వచ్ఛంద సంస్థ’ నుంచి నెలకు రూ.100.. సంవత్సరానికి రూ.1200 హరితనిధికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ స్వచ్ఛందంగా.. బాధ్యతగా పర్యావరణ సమతుల్యత కోసం కృషి చేయాలి. – సురగణ రాణాప్రతాప్, సేవ్ ఏ లైఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు
దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. హరితనిధిలో ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషం. భవిష్యత్‌లో మరింత పచ్చదనం పెంపునకు హరితనిధి తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరూ నిధిని ఏర్పాటు చేసుకొని బాధ్యతను తెలుసుకుంటే భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాం.హరితనిధికి నా వంతు సాయం చేస్తా.-సునీల్ కుమార్,రిసాల బజార్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్.
అశోకచక్రవర్తి చేసిన ఆలోచనే నేడు సీఎం కేసీఆర్ తిరిగి మొక్కలను పెంచే బాధ్యతను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. పర్యావరణం ముంపుతో మానవాళి,జీవరాశులకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచివున్నది. హరితనిధి ఆచోచన సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం.ఈ ఆలోచనతో రాష్ట్రంలో హరితవనాల సంరక్షణకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి- బోర నాగేశ్వర్రావు, పర్యావరణ కార్యకర్త, జీడిమెట్ల
ఐకమత్యంతో కాలనీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాం..కాలనీ ఆహ్లాదంగా ఉండేలా ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటుగా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీలోని నాలుగు పార్కులు అద్భుతంగా ఉన్నాయి. ఔషధ మొక్కల పార్కుతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. -సుధాకర్‌రెడ్డి (అధ్యక్షుడు, సాయిరాంనగర్ కాలనీ)
సాయిరాంనగర్ కాలనీలో పచ్చని చెట్లు, అందమైన పార్కులతో అద్భుతంగా ఉంది. పార్కుల్లోని ఔషధ మొక్కలతో స్థానికులకు ఎంతో మేలు జరుగుతుంది. నాకు ప్రగతి రిసార్ట్‌లో అడ్వజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మా కాలనీ పార్కులో ప్రతి మొక్కను గుర్తిస్తాను. మా కాలనీవాసులమంతా ఉదయం, సాయంత్రం పార్కులోనే వాకింగ్ చేస్తాం. ఒక్కదోమ కూడా కనిపించదు. ఈ పార్కులో ప్రతి రోజూ ఒక గంట వరకు మహిళల వాకింగ్ కోసం సమయం కేటాయిస్తాం. -రిటైర్డ్ ఆర్డీవో రఘునాథ్ రావు
సీఎం కేసీఆర్ పచ్చదనం కోసం హరిత నిధిని ఏర్పాటు చేయాలి నిర్ణయించడం అద్భుతమైన ఆలోచన. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెరిగింది. అడవులతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రాంతంలో మొక్కలను నాటి పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నారు. హరితహారం స్ఫూర్తితో మా ఇంట్లోనే పొదరిల్లు పేరుతో మొక్కలు, పక్షులతో తీర్చిదిద్దాను. హరిత నిధితో మరిన్ని మొక్కల పెంపకానికి అవకాశం ఉంది. దీంతో రాష్ట్రమంతా పచ్చదనంతో నిండుతుంది. -బండి సత్యనారాయణ (విశ్రాంత ఆర్మీ, పోస్టల్ ఉద్యోగి, సామాజిక వేత్త )
సీఎం కేసీఆర్ తీసుకున్న హరిత నిధి ఏర్పాటు నిర్ణయంతో తెలంగాణలోని భూములు పచ్చని మాగాణిలా మారుతాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ర్టాన్ని హరితవనంలా తీర్చిదిద్దేందుకు మొట్టమొదటి సారి హరితనిధి ఏర్పాటు చేయడం శుభపరిణామం. రాజకీయాలకతీతంగా ఈ హరితనిధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. -కాండూరి కృష్ణమాచారి, తెలంగాణ ఆలయాల అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు