గ్రేటర్‌లోని కాలనీల్లో వంద శాతం గ్రీనరే లక్ష్యంగా జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్‌కు శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరంలోని 4846 కాలనీల్లో వంద శాతం మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి..లక్ష్యం పూర్తి దిశగా అడుగులు వేస్తున్న బల్దియా… ఇదే స్ఫూర్తితో వంద శాతం పచ్చదనం ఉండేలా పనులు చేపడుతున్నది. గాజులరామారం అర్బన్ పార్క్‌ను శుక్రవారం సీఎస్ సోమేశ్‌కుమార్ సందర్శించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అటవీ శాఖ కన్జర్వేటర్ దొబ్రియల్ ఒక్షిత్ హిల్ కాలనీలో మొక్కలు నాటారు. గ్రేటర్‌లోని కాలనీలన్నింటిలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు. కాలనీల ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక ప్రధాన రహదారుల వెంబడి నాటుతున్న మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మియాపూర్ బస్‌డిపో, బీకే ఎన్క్లేవ్ రోడ్, రాందేవ్‌గూడ నుంచి నెక్నాంపూర్ రోడ్, మల్కాజిగిరి సర్కిల్లోని జడ్‌టీసీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు ఈ ప్లాంటేషన్ చేపట్టారు.అరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు పనులు కొనసాగుతున్నాయి. రహదారులకు ఇరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక అడుగు వరకు ఎదిగే పొగడ, బిజ్జోనియా మెగాఫోటమికా జాతి మొక్కలు, చివరి వరుసల్లో ఏపుగా పెరిగి నీడ నిచ్చే వేప, రావి, మర్రి తదితర మొక్కలను నాటారు.