‘ఆహ్లాదాన్ని, ఆక్సిజన్‌ను అందించే చెట్లను నాటడమే రాబోయే తరాలకు మనం మిగిల్చే గొప్ప ఆస్తి’ అన్న ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత యజ్ఞం నలువైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది. ఆయన ఆలోచన సాకారమై అంతర్జాతీయ కార్యకలాపాలకు వేదికైన హైదరాబాద్ లాంటి కాస్మొపాలిటన్ సిటీలో గత ఏడేండ్లుగా పచ్చదనం పెరిగింది. బలమైన సంకల్పంతో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 14.5 కోట్ల మొక్కలు నాటారు.
2015 లో మొదలైన ప్రయత్నంతో అవి ఇప్పుడు పచ్చని లోగిళ్లుగా కనువిందు చేస్తూ నగర దారుల రూపు రేఖలను మార్చేశాయి. 158 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగురోడ్డుపై ఏకంగా దట్టమైన వనాలే వెలిశాయి. ఎక్కడ సెంటు భూమి కనపడినా చెట్లు నాటి గ్రీనరీ నింపడంతో గత ఏడాది కాలంగా సిటీ గ్రీనరీపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఎరిక్ సోల్హెమ్ వంటి అంతర్జాతీయ పర్యావేరణ వేత్తలు కూడా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
చిన్నప్పుడు మన ఊర్ల నుంచి ఎవరన్న హైదరాబాద్‌కు వచ్చి పదిహేను- ఇరవై రోజులు ఉంటే మనిషి తెల్లగ అయ్యెటోడు. ఊర్లకు వాపస్ రాంగనే.. తెల్లగ కనబడితే.. ‘వీనికి గండిపేట నీళ్లు పడ్డయిరా’ అందురు. ఆ గండిపేట నీళ్లు వికారాబాద్ అడవులల్ల ఉండే ఔషధ వనాల ద్వారా ప్రవహించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లోకి వచ్చేవి. అంత శ్రేష్టమైన నీళ్లు మనకు లభించేవి. అందుకే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున గ్రీనరీని పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇప్పటికే ఆ లక్ష్యాన్ని మించి 14.5 కోట్ల మొక్కలు నాటాం. దీన్ని నిరంతరం కొనసాగిస్తాం.
హైదరాబాద్..బెస్ట్ లవబుల్- లివబుల్ సిటీ. మంచి అట్రాక్షన్ ఉన్న సిటీ కూడా. ఔటర్ రింగు రోడ్డే కాకుండా…ఇప్పుడు రీజనల్ రింగు రోడ్డు కూడా వస్తుండడంతో సిటీలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుని అద్భుతంగా పురోగమిస్తున్నది . ప్రతి సంవత్సరం అనేక లక్షల స్కేర్ ఫీట్లల్లో నిర్మాణాలు వస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ వస్తున్నది. ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలతో పాటు మరిన్ని ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి.
అయితే గ్రీనరీ విషయంలో మాత్రం రాజీ పడం. కఠినంగానే వ్యవహరిస్తాం. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఓ చెట్టును నరికేస్తే 4 లక్షల రూపాయల జరిమానా విధించినం. హైదరాబాద్ ఎకో సిస్టమ్‌ను మెయింటేన్ చేయడానికి (పర్యావరణాన్ని సంరక్షించేందుకు) సిటీ చుట్టూ 188 రిజర్వ్ ఫారెస్టుల బ్లాకుల్లో ఉన్న 1,60,661 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున చెట్లు పెంచుతున్నాం. …2021 అక్టోబర్ 1న శాసన సభలో సీఎం కేసీఆర్
నగరానికి ప్రతిష్టాత్మక రవాణా మార్గమైన అవుటర్ రింగ్‌రోడ్డు పచ్చనిశోభతో అలరిస్తోంది. భావితరాలకు తరగని ఆస్తిగా పచ్చ‘ధనాన్ని’ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంతో అవుటర్ మార్గం పచ్చని మణిహారంలా మారింది. మొక్కుబడిగా కాకుండా, ప్రతియేటా వానకాలంలో యజ్ఞంలా సాగుతున్న హరితహారంతో నేడు అవుటర్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి.
158 కిలోమీటర్ల అవుటర్ రహదారి మధ్యలో సెంట్రల్ మెరీడియన్లు..సర్వీసు రోడ్లకు ఇరువైపులా…రాతి గుట్టల ప్రాంతాలు…నీళ్లు నిలిచే అవకాశమున్న ప్రాంతాలు..ఇంటర్ చేంజ్‌లు..ఇలా ఒకటేమిటి అనువైన స్థలం ఉన్నచోట నాటిన మొక్కలతో అవుటర్ రింగు రోడ్డు నగరానికి వచ్చే దేశీయ, విదేశీ ప్రముఖులకు హరిత స్వాగతాన్ని పలుకుతోంది.
ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. మొక్క మొక్క తోడై…ఒక హరితవనంలా మారి అవుటర్ అందాలను మరింత ద్విగుణీకృతం చేసింది. అందుకే కొన్నిరోజులుగా అవుటర్ రింగు రోడ్డు పచ్చదనంపై జాతీయ,అంతర్జాతీయంగా ప్రశంసలు జల్లు కురుస్తుంది. ప్రముఖులే కాదు..సామాన్యుడు మొదలు వివిధ రంగాలకు చెందినవారు అవుటర్ అందాల ఫొటోలను షేర్ చేస్తూ కొనియాడుతున్న సందర్భాలు అనేకం. ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్లే వారు, వచ్చే వారు అవుటర్ పచ్చదనాన్ని తమ ఫోన్లలో బంధించి తెలంగాణ సర్కారు హరిత యజ్ఞాన్ని అభినందిస్తున్నారు.
రవాణా మార్గాలను పచ్చదనంతో తీర్చిదిద్దడం అంత తేలికైన పనికాదు. రాష్ట్రంలో ఆచరణలో చేసి చూపించారని గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ఎరిక్ సోల్హెమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా పచ్చనిచెట్లు ఆకట్టుకుంటున్నాయంటూ ఓఆర్ఆర్ ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. వెల్డన్ అంటూ తెలంగాణ సీఎంవో, కేటీఆర్టీఆర్ఎస్ ట్విట్టర్ ఖాతాలకు వాటిని ట్యాగ్ చేశారు.
ఆకట్టుకునే డ్రైవ్ : కార్తీ చిదంబరం, ఎంపీ తమిళనాడు
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు భారతదేశంలోని ఒక విమానాశ్రయం నుంచి ఒక నగరానికి అత్యంత ఆకట్టుకునే డ్రైవ్.
లండన్ రింగు రోడ్డు మాదిరి : డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంగ్లండ్ డిప్యూటీ హై కమిషనర్
లండన్ రింగు రోడ్డు (ఎం25)మాదిరిగానే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు కూడా ఆకట్టుకుంటున్నది.
ఎంతో ముచ్చటగా ఉంది : చంద్రశేఖర్ డాగే, ప్రముఖ ఆర్కిటెక్ట్
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఎంతో అందంగా ఉంది. దేశంలోనే అత్యంత అందమైన రింగు రోడ్డు ఇది.
2015 నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 14 కోట్ల మొక్కలు నాటారు. ఒక్క అవుటర్ రింగ్‌రోడ్డు చుట్టే 1.20 కోట్ల వరకు నాటడం విశేషం. ఇప్పుడవి ఏపుగా పెరగడంతో చూపరులను కనువిందు చేస్తోంది.
ఆకట్టుకునే ఇంటర్‌చేంజ్‌లు : సాయికాంత్ కృష్ణ, డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్ పైలట్
ఔటర్‌రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. డ్రోన్ కెమెరాతో ఇంటర్ చేంజ్‌పై వాహనాల రాకపోకలతోపాటు అక్కడి పచ్చదనాన్ని కనిపించే వీడియో పుటేజ్‌ను ట్విట్టర్లో పోస్టు చేయగా వందలాది మంది లైక్ చేయడంతో రీట్వీట్లు, కోట్స్ చేశారు.