మేడ్చల్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ)/కుత్బుల్లాపూర్ : రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ బాధిత కుటుంబాలతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన షాపూర్‌నగర్ ఎం.జే గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 22ఏ కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగిఉందని, దీనికి ఏ-1 సీఎం రేవంత్, ఏ-2గా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 22ఏ అక్రమాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించింది. ఒకవైపు సీఎం తన తమ్ముడికి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెడుతూ మరోవైపు పాఠశాలలు, పార్కులు, చివరికి శ్మశానవాటిక భూములను కూడా అమ్మకానికి పెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అమీన్పూర్ పీఎస్‌తో పాటు సీఎం ఇల్లు ఉన్న సర్వే నంబర్ కూడా 22ఎలోనే ఉందంటే.. కాంగ్రెస్ పాలన ఎంత గుడ్డిగా ఉందో అర్ధమవుతుందన్నారు. 22ఏ ను రద్దుచేయని పక్షంలో సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సభను దద్దరిల్లేలా స్తంభింజేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా(22ఏ) కారణంగా నష్టపోయిన బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది. కుత్బుల్లాపూర్ రెవెన్యూ విలేజ్ పరిధిలోకి పద్మానగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సుమారు 14 ఎకరాల భూమి విషయంలో 2018లోనే కలెక్టర్, రెవెన్యూ శాఖల ద్వారా అన్నిరకాల క్లియరెన్స్‌లు ఇప్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. ఇదే తరహాలో కుత్బుల్లాపూర్‌లో పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది.
– కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్
మేడ్చల్/కుత్బుల్లాపూర్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అసమర్ధతో తీసుకువచ్చిన 22ఏ తీరుకు పేద ప్రజలెందుకు కార్యాలయాల చుట్టూ తిరిగాలని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజాంపేట్ స్ప్రింగ్ఫీల్డ్ కాలనీలో విల్లా, ప్లాట్‌కు రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, అమీన్పూర్ భాదితులను అధికారులు చుట్టూ తిప్పించుకొని దళారులను కలవాలని బెదిరిస్తున్నారని అక్కడి భాదితులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్‌లో 58 ఏళ్ల నాటి పద్మానగర్, స్ప్రింగ్ఫీల్డ్, నిజాంపేట్ వంటి లేవఅవుట్లతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం, యాదాద్రి జిల్లా రాజంపేట మండలం చెల్లూరులో ఏకంగా సగం ఊరినే 22ఏలో పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కోటి ఎకరాల వ్యవసాయ భూములను 22ఏలో పెట్టడం వల్ల రైతులకు రైతుబంధు, ఎరువులు, విద్యుత్ కనెక్షన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల కబ్జాలు, నిషేధిత జాబితాలో పట్టా భూములను పెట్టి సెటిల్మెంట్లు, లంచాలేకే ప్రాధన్యతనిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు, అభివృద్ధి పథకాలపై వార్తలు వస్తే..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం భూకబ్జాలు, బెదిరింపుల వార్తలే చూస్తున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో 22ఎపై సమావేశం నిర్వహించిన వెనువెంటనే అక్కడి అధికారులు నిషేదిత జాబితాలో నుండి వాటిని తొలగిస్తున్నట్లు అధికారుల నుండి సమాధానాలు రావడం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాట ఫలితమే అని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర నిరాశ, భయంతో నిత్యం కేటీఆర్, హరీశ్‌రావుల జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
– శంభీపూర్‌రాజు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు
నిషేధిత జాబితా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ భూమి యజమానులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. సర్వే నంబర్ 307 పరిధిలో మొత్తం 441 ఎకరాల భూమి ఉండగా, అందులో దాదాపు 120 నుంచి 128 ఎకరాల వరకు ప్రైవేట్ భూమి ఉంది. అందులో ఇప్పటికే అనేక నిర్మాణాలు, అపార్ట్మెంట్లు పూర్తికాగా కొన్నింటికి హుడా లేఅవుట్ అనుమతులు లభించాయి. మొత్తం విస్తీర్ణంలో చిన్న 100 గజాల స్థలానికి కోర్టు కేసు ఉన్నప్పటికీ ఆ సర్వే నంబర్లోని మొత్తం 100 ఎకరాల భూమిని 22ఎ జాబితాలో చేర్చడం సరికాదు.
– శ్రీనివాస్, గాజులరామారం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా డైవర్ట్ చేసేందుకే 22ఏ పేరుతో కొత్త కుట్రకు తెరలేపింది. చింతల్ డివిజన్ పరిధిలోని రంగానగర్ కాలనీ స్థలాలను అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చారు. 1970లో ఏర్పాటైన రంగానగర్ కాలనీలో సర్వేనంబర్ 160 చింతల్ డివిజన్లో క్లియర్ టైటిల్ కలిగిన స్థలాలు ఉన్నప్పటికీ గత నాలుగైదు నెలలుగా వాటిని 22ఏ జాబితాలో చేర్చారు. దీని వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు రాకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– గుప్తా, రంగానగర్ కాలనీ అధ్యక్షుడు
రాష్ట్రంలో 22ఎ నిబంధన కారణంగా లక్షలాది మంది రైతులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిషేధిత భూమల సమస్యపై ప్రభుత్వం తీసుకువచ్చిన టోల్‌ఫ్రీ నంబర్‌పై ఎవరూ స్పందించడం లేదు. కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులకు సంబంధించిన నిర్మాణ సంస్థలు అసైన్డ్ భూములను ఆక్రమించాయని.. అన్ని ఆధారలతో వాటిని త్వరలోనే నిరూపిస్తాం. 22 ఏ ఎత్తేసేవరకు ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతాం.
– రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి
కుత్బుల్లాపూర్ సర్వే నంబర్ 101, 105లో 34 ఎకరాల పట్టా భూమిని (శ్రీరామ్‌నగర్ కాలనీ) డిఫెన్స్ అధికారులు తమ జీఎల్ఆర్ సర్వే నంబర్ 507 పరిధిలోకి వస్తుందని ఇబ్బందులు పెడుతున్నారు. 1968 నుంచి ఇవి పట్టా భూములని తెలిపే అన్ని రికార్డులు ఉన్నాయి. గతంలో రెవెన్యూ శాఖ అధికారులు ఢిఫెన్స్ ల్యాండ్ కాదని నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం డిఫెన్స్ అధికారులు పీపీఈ యాక్ట్ నోటీసులు ఇస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. దీని వల్ల బ్యాంక్ లోన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– సతీశ్‌రెడ్డి, శ్రీరామ్‌నగర్ అక్రమ వసూళ్లకే
నిజాంపేట్‌లో పలు సర్వే నంబర్లు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ కుట్ర వెనుక ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నేతలు ఒక్కొ విల్లా యజమాని నుంచి 30 వేల నుండి 40 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే సర్వే నంబర్ 233లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసిన స్థలాన్ని ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు.
– చంద్రశేఖర్, నిజాంపేట్
ఏళ్లనాటి ప్రైవేట్ భూములను ప్రస్తుతం 22ఏ ద్వారా నిషేధిత జాబితాలో చేర్చడంతో చాలామందికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో సర్వే నంబర్లు 192, 193లో ఉన్న భూములను తక్షణమే 22ఎ నుంచి తొలగించాలి. కష్టపడి కట్టుకున్న ఇళ్లకు, కొనుగోలు చేసిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయించలేని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి.
– సిద్ధ్దిరాములు, హెచ్ఏఎల్ రాఘవేంద్రకాలనీ అధ్యక్షుడు
నిషేధిత జాబితా కారణంగా దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన నివాసితులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పద్మానగర్ ఫేజ్-1 లేఅవుట్ 1968లో పూర్తయ్యింది. అప్పటి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు, పత్రాలతో 1989లో ప్లాట్ కొనుగోలు చేశాం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ ప్లాట్‌ను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సామా న్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– విజయసారధి, పద్మానగర్ ఫేజ్-1 కుత్బుల్లాపూర్