హైదరాబాద్, జనవరి 20: తమ అభిమాన నేతపై అక్రమ కేసులు బనాయించి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదనతో పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్ పీఎస్‌కు రాగా..ఆయనకు మద్దతుగా వేలసంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో శాంతియుతంగా పీఎస్ బయట వేచిఉన్న కార్యకర్తలను వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు..ఎందుకు తోసివేస్తున్నారంటూ నేతలు అడిగినప్పటికీ పట్టించుకోని ఖాకీలు.. మహిళలని కూడా చూడకుండా ఈడ్చిపారేశారు.ఇదేం అన్యాయం అని ప్రశ్నించిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు తాళ్లతో అడ్డుకొని తోసేయడంతో ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రోజంతా ఉద్రిక్తత
బంజారాహిల్స్, జనవరి 20: సిట్ విచారణకు మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. సిట్ విచారణ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు హరీశ్‌రావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు నేతలు, న్యాయవాదులు తరలిరావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. సాయంత్రం 6.25 గంటలకు సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన హరీశ్‌రావు అక్కడున్న నేతలు, కార్యకర్తలకు అభివాదం చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది.

