సిటీబ్యూరో/చార్మినార్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): నగరంలోని పాతబస్తీలో బుధవారం తెల్లవారుజామునే పోలీసుల హల్చల్.. రెయిన్‌బజార్ ఏరియాలో ఓ ప్రాంతంలోని ఇండ్లల్లో పోలీసుల సోదాలు.. ఏం జరుగుతుందోనంటూ భయంభయంగా చూస్తున్న స్థానికులు.. అప్పటికే 40 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ జాఫర్పహిల్వాన్ ఇంటివద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన ఒక హత్యకేసులో నిందితులు ఇద్దరు జాఫర్ ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఈ సోదాలు చేపట్టగా అక్కడ కొన్ని మారణాయుధాలు లభించాయి. అక్కడి నుంచి మాజీ రౌడీషీటర్ సయీద్ పహిల్వాన్, సులేమాన్ పహిల్వాన్ ఇండ్లల్లో తనిఖీలు చేసి అక్కడ కూడా మరికొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సోదాలు ఆ ప్రాంతంలో కలకలం రేపాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు పహిల్వాన్లు పరారీలో ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
పోలీసుల సోదాల్లో మారణాయుధాల స్వాధీనం
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని దక్షిణ మండల పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటా బ్రిడ్జ్ వద్ద ఈ నెలలో జునైద్ అనే వ్యక్తిపై వారి సమీప బంధువులు దాడిచేసి హతమార్చారు. అందులో 11 మంది నిందితులను గుర్తించి వారిలో 9 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తకరలించామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కుల్సుంబేగం, రహీగౌస్లు ఇదే పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా కొనసాగుతున్న జాఫర్ పహిల్వాన్ ఇంటిలో ఆశ్రయం పొందినట్లు సమాచారం అందడంతో అతని ఇంటిలో బుధవారం సోదాలు నిర్వహించామని ఇన్స్పెక్టర్ నేతాజి తెలిపారు. అతని ఇంటిలో 2 కత్తులతోపాటు ఓ గొడ్డలిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
జాఫర్ పహిల్వాన్ సమీప బంధువులైన సయీద్, సులేమాన్‌ల ఇండ్లల్లోనూ సోదాలు నిర్వహించగా 6 కత్తులు, రెండు గొడ్డళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సోదాల్లో పలుచోట్ల వివాదాస్పదమైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయని, వాటిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని తెలిపారు. హత్య కేసుతో సంబంధమున్న నిందితులతోపాటు ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని నేతాజీ తెలిపారు. ఈ సోదాల్లో దక్షిణ మండల పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది మొత్తం 60 మంది పాల్గొన్నారని తెలిపారు. నిర్మాణాలు చోటుచేసుకుంటున్న వారిని టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడినా, మామూళ్ల కోసం వేధించినా వదిలే ప్రసక్తే లేదని రెయిన్ బజార్ ఇన్స్పెక్టర్ నేతాజీ హెచ్చరించారు.
హద్దు దాటితే కఠినచర్యలు: సీపీ సజ్జనార్
గతనెల చివరివారంలో లంగర్‌హౌస్, టోలిచౌకి తదితర ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు వారు చెప్పిన అడ్రస్సులో ఉన్నారా లేదా అని పరిశీలించారు. వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలిపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి మానాలని, ఒకవేళ ఏదైనా నేరాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీయాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం నగరంలో రౌడీషీటర్ల వ్యవహారంపై ఆయన సీరియస్‌గా ఉన్నారు. పాత నేరస్తుల చరిత్రను పరిశీలించి వారి ప్రస్తుత జీవన విధానంపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఎస్‌హెచ్‌వోలను ఆయన ఆదేశాలు జారీచేశారు. ఇటీవల జరిగిన హత్యలు, బెదిరింపుల వంటి ఘటనల్లో పాల్గొన్న రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని వారిపై సీరియస్ కేసులు నమోదు చేయాలని సజ్జనార్ చెప్పారు.