Doctor | వెంగళరావునగర్, ఫిబ్రవరి 9: అతడి పిచ్చికి వైద్యం చేసింది ఆ వైద్యురాలు. ప్రేమించాలంటూ డాక్టరమ్మని వేధించాడు ఆ రోగి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం హోటల్‌కు తనతో రమ్మంటాడు. లంచ్‌కు కెళదామని.. డిన్నర్‌కు రమ్మంటూ వేధించాడు. ఫోన్ నంబ ర్ని బ్లాక్ చేస్తే.. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేసి సతాయిస్తున్నాడు. ఇంటి ముందుకొచ్చి మరీ వేధిస్తుండటంతో విసిగిపోయిన ఆ వైద్యురాలు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్నగర్లో నివాసం ఉండే ఓ వైద్యురాలు కూకట్‌పల్లిలోని ప్రైవేటు దవాఖానలో పనిచేస్తున్నది. రెండేళ్ల కిందట మెహిదీపట్నంకి చెందిన ఓ వ్యక్తి(30) మానసిక రుగ్మతలతో ఆసుపత్రికి వచ్చాడు.అతడిని పరీక్షించగా.. అతడికి ఉన్న రోగాన్ని వైద్య పరిభాషలో స్కైజో ఫర్నియాగా గుర్తించి నిర్ధారించారు.
పలుమార్లు చికిత్స కోసం దవాఖానకు వెళ్లాడతను. గతేడాది నవంబర్ నుంచి మానసిక రోగి ప్రవర్తనలో మార్పులొచ్చాయి. కాఫీకెళ్లి కబుర్లు చెప్పుకుందాం రమ్మంటాడు. కలిసి లంచ్.. డిన్నర్ కు హోటల్‌కు వెళదామంటాడు. దాంతో ఆ రోగికి చికిత్స చేసేందుకు పురుష వైద్యుడికి సిఫార్సు చేసింది ఆ వైద్యురాలు. ఫోన్ నంబర్ కనుక్కుని అర్ధరాత్రి, తెల్లవారు జామున ఫోన్లు చేస్తూ ఆ డాక్టర్‌కు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఫోన్ నంబర్ని బ్లాక్ చేస్తే వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేస్తున్నాడు. మాట్లాడకపోవడంతో ఇంటి ముందుకొచ్చి మరీ వేధిస్తున్నాడు. ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు అతడిని వారించినా వినిపించుకోవడం లేదు. అతడి వేధింపులపై విసిగిపోయిన బాధిత వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.