New Year | సిటీబ్యూరో: మరో కొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024కి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో 2025ను ఆహ్వానించబోతున్నాం. ఈ మధుర క్షణాలను ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరూ కుటుంబ సమేతంగా వేడుకలు ఏర్పాటు చేసుకుంటే..మరి కొందరూ స్నేహితులతో రిసార్టులు, ఈవెంట్ వేడుకలకు వెళ్లడానికి రెడీ అయ్యారు. మొత్తంగా నగరం కొత్త ఏడాది ఉత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం నుంచే ‘31’ సంబురాలు ఊపందుకోనున్నాయి. గడిచిన క్షణాల నుంచి మంచిని తీసుకొని రాబోయే కాలం లో విజయాల వైపు నడిచేందుకు న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా వారి డైరీలో ప్రణాళికలు రాసుకుంటున్నారు.
ఇప్పటి వరకు చేయాలనుకున్నవి చేయలేకపోవడానికి కారణాలను పరిశీలించుకొని ఇకపై వచ్చే రోజుల్లో అన్ని సక్రమంగా చేసుకునేలా తమ కు తాము సూచనలు చేసుకుంటున్నారు. కొందరు రోజూ ఉదయం వాకింగ్ చేయడం, ఇంకొందరు జిమ్‌కు వెళ్లడం, మరికొందరు పుస్తకాలు చదవడం, కొత్త భాషలు నేర్చుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడం తదితర లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలోనైనా ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తామంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుండటం విశేషం.
ఉచితంగా రవాణా సేవలు
తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ‘హమ్ ఆప్కే సాథ్ హై’ థీమ్‌తో మద్యం సేవించి వాహనం నడపకూడదని క్యాంపెయిన్ జరుగుతున్నది. అందులో భాగంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు ఉచితంగా రవాణా సేవలందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. 31న రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 9177624678 నంబర్‌కు ఫోన్ చేసి డ్రాపింగ్ వివరాలు తెలుపాలని సూచించారు.