మన్సురాబాద్, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలు, కార్మికుల అభివృద్ధి కోసం కేవలం రూ. 371 కోట్లు నామమాత్రంగా కేటాయించి చేనేతకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో చేనేత రంగానికి తగినన్ని నిధులు కేటాయించనందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గురువారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన్సురాబాద్ డివిజన్, సహారా స్టేట్స్ కాలనీ మొదటి గేటు వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వనం శాంతి కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేత కుటుంబాలను అభివృద్ధి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సిరిసిల్ల, వరంగల్, మల్కాపూర్, గుండ్ల పోచంపల్లి టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదన్నారు. చేనేత, పవర్లూమ్ పరికరాలకు 90 శాతం సబ్సిడీ అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమ, కార్మికుల అభివృద్ధి పై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలంటే రూ.2000 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఇందులో కేవలం రూ. 371 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. చేనేత అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 371 కోట్లతో గతంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్మికుల కుటుంబాలకు అండగా ఉండే త్రిఫ్ట్ పథకాన్ని పునరుద్ధరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీనామేషాలు లెక్కపెడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కార్మికులకు ఉపాధి లేక సుమారు 300 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక వేలాదిమంది కార్మికులు కుటుంబాలను వదిలి వలసలు పోయారని ఇలాంటి దారుణ పరిస్థితిలో కార్మికులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్లు, సీట్లు, అధికారం కోసం హామీలు ఇవ్వడమే తప్ప కార్మికులకు ఉపాధి కల్పించి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని బడ్జెట్లో కేటాయింపులను చూస్తే అర్థమవుతుందన్నారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమ, కార్మికుల అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ చేనేత కార్మిక సంఘం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షుడు వర్కాల చంద్రశేఖర్, నాయకులు పెంటయ్య, శేఖరయ్యా, గజం శ్రీశైలం, వల్లకాటి వెంకటేష్, గుండు గోవర్ధన్, చెరుపల్లి రవికుమార్, తిరందాస్ జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.