సిటీ బ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హజ్ యాత్రకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈనెల 29 నుంచి మే 29 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అన్నారు. హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో మంగళవారం ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలురాష్ర్టాల నుంచి ఈ ఏడాది 11వేల మంది హజ్‌యాత్ర చేయనున్నట్లు తెలిపారు.
మదీనాకు ఏప్రిల్ 29 నుంచి మే13 వరకు, జిద్దాకు మే 16 నుంచి మే 29 వరకు విమానాలు నడుస్తాయని తెలిపారు. జిద్దా నుంచి తిరిగి వచ్చే విమానాలు జూన్ 12 నుంచి జూలై 9 వరకు మధ్య నడుస్తాయని, 31 విమానాలు యాత్రికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సజ్జాద్ అలీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇర్ఫాన్ షరీఫ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.