Hyderabad | హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్ స్ట్రీట్‌కు వచ్చాడు. రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు అతడిని వెంబడించారు. అది గమనించి రషీద్ పారిపోతుండటంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రషీద్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.