సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పసికందుల విక్రయాల ముఠా నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌చేసిన శిశు విక్రయాల ముఠా వ్యవహారం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. గతంలో ఈ ముఠా 21 మంది పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే అప్పట్లో పోలీసులు ఈ కేసులో మూలాల వరకు వెళ్లి ఇతర రాష్ర్టాలలో ఉన్న కీలక నిందితులను పట్టుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చైతన్యపురి పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన ముఠా నాయకురాలు కృష్ణవేణికి సహాయకుడిగా వ్యవహరించిన నాగరాజు ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి తన పేరును మురగన్గా మార్చుకొని గుజరాత్ నుంచి పిల్లల విక్రయాల దందాను యథేచ్చగా కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఇటీవల నాగరాజు అలియాస్ మురగన్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించిన ఘటనతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో పిల్లల అక్రమ విక్రయాలకు సంబంధించిన ఘటనలు పెను సంచలనం రేపాయి. ఇప్పుడు మురగన్ కేసులోనూ ఇదే తరహా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కుత్బుల్లాపూర్‌కు చెందిన కోల కృష్ణవేణి బయో కెమిస్ట్రీ వరకు చదివి, వికారాబాద్‌కు చెందిన రవికుమార్‌ను 2016లో పెండ్లి చేసుకుంది.
వీరికి పిల్లలు కాకపోవడంతో 2019లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న సమయంలో కొందరు పిల్లలను కొనుగోలు చేయడం, దత్తత తీసుకునే విషయాలు తన దృష్టికి రావడం, అందుకు ఆమె సహకరించింది. దీంతో పిల్లల విక్రయాలు నేనెందుకు చేయవద్దనే ఉద్దేశ్యంతో నేరుగా సోషల్‌మీడియాలో శిశు విక్రయాలకు సంబంధించిన అంశాలపై శోధించింది. దీంతో ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఒక శిశువును కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించేందుకు రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుంది. మనోజ్ ముఠా ఢిల్లీ నుంచి 2024లో మగ శిశువును హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే వీరు శిశువును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విశ్వనీయం సమాచారం మేరకు గోపాలపురం పోలీసులు రైడ్చేసి కృష్ణవేణిని అరెస్ట్ చేశారు.
అయితే కృష్ణవేణి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పిల్లల విక్రయాలను పకడ్బందీగా చేయాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో మరింతగా శోధించి గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన వందన అనే మహిళతో పరిచయం చేసుకుంది, గుజరాత్ నుంచి పిల్లలను పంపించడం వందన చూసుకుంటుండగా తెలుగు రాష్ర్టాలలో ఆ పిల్లలను విక్రయించే బాధ్యత కృష్ణవేణి చూసుకునేది. ఆడ శిశుకు రూ. 1.5 లక్షలు, మగ శిశుకు రూ.2.5 లక్షలకు కొని, దానిని అవసరాలను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కృష్ణవేణి విక్రయించింది.
కృష్ణవేణి గ్యాంగ్‌లో దీప్తి, సంపత్‌కుమార్, నాగరాజు తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ ముఠాను ఫిబ్రవరి, 2025లో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు, చైతన్యపురి పోలీసులు ఓ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. అయితే పోలీసులు కేవలం ఇక్కడ దొరికిన ముఠాపై మాత్రమే దృష్టి పెట్టారు. గుజరాత్లో పిల్లలను విక్రయించే ముఠాలు, ఎక్కడి నుంచి పిల్లలను తెస్తున్నారనే విషయాలను వెలుగులోకి తీసుకురాలేకపోయారు. కృష్ణవేణి ముఠా సభ్యులపై దృష్టిపెట్టి వారి అరెస్ట్ చేసి అంతటితో ఈ కేసును వదిలేశారు.
రెండు తెలుగు రాష్ర్టాలలో కృష్ణవేణి ముఠా సుమారు 21 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పిల్లల విక్రయాలతో ఈజీగా డబ్బు సంపాదిస్తున్న విషయాన్ని నాగరాజు అలియాస్ మురగన్ గుర్తించాడు. చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేయడంతో సుమారు 3 నెలల పాటు జైల్లో ఉన్న నాగరాజు.. జైలు నుంచి బయటకు రాగానే పిల్లల విక్రయాలపైనే దృష్టి పెట్టాడు. గతంలో గుజరాత్ నుంచి పిల్లలను పంపించే వారి గూర్చి ఆరా తీశాడు.
పోలీసులు దృష్టాంతా ముఠా నాయకురాలు కృష్ణవేణిపై ఉంటుందని గుర్తించాడు. దీంతో బయటకు వెళ్లి గతంలో తనకు ఉన్న పరిచయాలతో పిల్లల విక్రయాలపై ఆరా తీసి, గుజరాత్ నుంచి పిల్లలను విక్రయించేందుకు మురగన్ అవతారమెత్తాడు. అక్కడ గత 6 నెలలుగా తన దందాను కొనసాగిస్తూ పిల్లలను విక్రయించడం మొదలు పెట్టాడు. 10 రోజుల కింద గుజరాత్లో అనుమానాస్పదంగా బస్సులో పిల్లలను తీసికెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో మురగన్ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది.
మురగన్ పాత రికార్డులను పరిశీలించడంతో చైతన్యపురిలో గతంలో అరెస్ట్ అయినట్లు, అయితే అప్పట్లో నాగరాజు పేరుతోనే చలామణి అయిన, జైలు నుంచి బయటకు రాగానే మురగన్గా పేరు మార్చుకున్నాడని పోలీసులు గుర్తించాడు. పిల్లలులేని వారు ఫెర్టిలిటీ సెంటర్లకు వస్తుంటారు, అక్కడే పిల్లలను కొనేవారు ఈజీగా దొరకుతారనే విషయం మురగన్‌కు తెలుసు. ఈ నేపథ్యంలోనే మురగన్ ముఠా 25 మంది పసిపిల్లలను విక్రయించినట్లు వెలుగులోకి రావడంతో ఎక్కడెక్కడ విక్రయించారనేదానిపై గుజరాత్ పోలీసులు దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేసి పలు వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఇక్కడి పోలీసులు ఒక ముఠాను పట్టుకోగానే, ఆ ముఠా తరువాత ఏమి చేస్తుందనే విషయంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో జైల్లోనే కఠినంగా మారుతూ.. నిందితులు ఆవే నేరాలు చేస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. గతంలో మన తెలంగాణ పోలీసులు వెళ్లి ఇతర రాష్ర్టాలలోని మూలాలను గుర్తించి కీలక నిందితులను పట్టుకునేవారు. నేడు ఆ విషయాన్ని మన పోలీసులు మరిచిపోయారు. దీంతోనే గుజరాత్లో పిల్లల విక్రయాలు చేస్తున్న కీలక ముఠాలను పోలీసులు పట్టుకోలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.