హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాల్లో మెరుగైన వార్షిక వృద్ధి రేటు 29 శాతంగా నమోదైంది. 2019 నుంచి 2024 వరకు సీఏజీఆర్ గణాంకాలను క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థలు కలిసి ఒక నివేదికను రూపొందించాయి.ఈ నివేదికను ఇటీవల జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో విడుదల చేశారు. 2019తో పోలిస్తే ఇప్పటి మార్కెట్ ఎలా ఉందనేది ప్రధానంగా ఈ నివేదికలో విశ్లేషించారు. 2019 ప్రథమార్థంతో పోలిస్తే 2024 విక్రయాల్లో 148 శాతం వృద్ధి నమోదైందని, రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తుల విక్రయాల్లో ఏకంగా 760 శాతం వృద్ధి నమోదైనట్లు ఆ వేదికలో పేర్కొన్నారు. అమ్మకానికి లక్షకు పైగా ఇళ్లు ఉన్నాయని, గతంతో పోలిస్తే ఇన్వెంటరీ సమయం తగ్గుతోందని పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో ఐదేళ్లలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాథమిక విక్రయాలు, ఇళ్ల ధరల విషయంలో మంచి పెరుగుదల నమోదైనట్లు గుర్తించారు. 2019లో విక్రయించిన ఇళ్ల విలువ మొత్తం రూ.34,044 కోట్లు ఉండగా, 2023-24 నాటికి 1,15,759 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే విషయంలో నగరంలోని బిల్డర్లు చాలా జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్‌ను పరిగణలోకి తీసుకొని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో కంటే కూడా తక్కువగా ఈ ఏడాది ప్రథమార్థంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. జూన్ నాటికి నగరంలో 21936 యూనిట్లను మాత్రమే ప్రారంభించారు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన రియల్ ఎస్టేట్ వర్గాలు కొత్త ప్రాజెక్టులను తొందరపడి ప్రారంభించగా, మార్కెట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.