హిమాయత్ నగర్,మే 20: పోచారం సద్భావన టౌన్‌షిప్‌లోని రాజీవ్ స్వగృహలో కామన్ సర్వీసెస్‌ను పున: ప్రారంభించి తమ సమస్యలను పరిష్కరించాలని హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో వద్ద మంగళవారం బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, గోపాల్, గడ్డం బాలకృష్ణ, సాయికిరణ్, మహేశ్, బాలాజీ, అంజనేయులు, లాజరస్, గణపతి,వెంకట నారాయణ మాట్లాడారు. పేద, మధ్య తరగతికి చెందిన తాము బ్యాంక్ లోన్లు తీసుకుని 2500 ఎస్ఎఫ్టీ ప్లాట్లను రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశామని తెలిపారు.
అన్ని వసతులు పూర్తి చేసి చేతికి తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ముఖం చాటేసిందని ఆరోపించారు. ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో ఉన్న తమకు మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించడం వీలు కాదని తేల్చి చెప్పారు. తక్కువకు వస్తుందని ఆశపడి ఇల్లు కొనుక్కున్నామని, గృహ నిర్మాణ సంస్థ జీఎం నరేందర్‌రెడ్డిని కలిస్తే ఎండీ గౌతమ్ ను కలువాలని ఒకరిపై మరొకరు చెబుతూ తప్పించుకుంటారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉంది మీ చావు మీరు చావండని ఎండీ అంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమస్యలు మరింత పెరిగిపోయాయన్నారు. విక్రయించని ఫ్లాట్లు (సీ1 నుంచి సీ3), (డీ1 నుంచి డీ8) బ్లాక్ లకు 1.01 పైసల్ టీజీ ఆర్ సీఎల్ నుంచి నిర్వహణ చార్జీలు ఇవ్వాలన్నారు. లిఫ్ట్(ఏఎంసీ), ఎస్ టీపీ, హౌస్ కీపింగ్, నీటి బిల్లు నిర్వహణ, వాటర్ టెర్రస్ ప్రూఫింగ్ తో పాటు టవర్లకు పెయింట్ వేయాలని డిమాండ్ చేశారు.