మేడ్చల్, జూలై 30(నమస్తే తెలంగాణ): వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. రైతులకు కావాల్సిన ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రధానంగా వరి, పండ్ల తోటలు, కూరగాయలు, ఆకు కూరలు, మొక్కజొన్న, కందులు, జొన్నలు తదితర పంటలను రైతులు సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు. వానలు తగ్గు ముఖం పట్టడంతో వరి నాట్లు ఉపందుకున్నాయి. వానకాలం సీజన్లో జిల్లాలో 18వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతున్నది. అయితే వరి పంటసాగుకు కావాల్సినతంగా వానలు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.