GHMC | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మియాపూర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ కార్పొరేషన్ ఆదాయన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. ప్రధానమైన ఆదాయ వనరుగా వస్తున్న ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సుల ఫీజు వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా..ఆ మేరకు ఆశించిన మేర రావడం లేదు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న దరిమిలా దూకుడు పెంచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టిసారించారు.
ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన చెక్కులు బౌన్స్ అవుతున్నా ఇప్పటివరకు వారికి నోటీసులు ఇచ్చి ఆపై వదిలివేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, కార్యకలాపాలు ఉన్న నిర్మాణదారులు కూడా ఇలా మొండికేస్తే ఇకపై నిబంధనల కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. పలు దశల్లో నోటీసులు ఇచ్చినా వినకుంటే వారి వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే పన్ను కచ్చితంగా చెల్లిస్తారని భావిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రస్తుతం ఏటా సుమారు రూ.4,445 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో గ్రాంట్లు, ఇతరత్రా ఉన్నప్పటికీ ప్రధానంగా ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సుల ఫీజు వసూలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.1970 కోట్ల మేర పన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటివరకు సుమారు రూ.1400 కోట్ల వరకు వసూలైనట్లు తెలుస్తున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా వసూళ్లు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు అధికారులపై ఒత్తిడి పెంచారు. అయితే ప్రతి సంవత్సరం వసూళ్లలో భాగంగా అధికారులు కోట్లాది రూపాయల విలువైన చెక్కులు అందుకుంటారు.
ఈ రూపంలో ఆస్తిపన్నుదారులు సక్రమంగానే చెల్లింపులు చేస్తున్నా… కొందరి చెక్కులు మాత్రం బౌన్స్ అవుతుంటాయి. దీంతో అధికారులు ఇప్పటివరకు ఈ చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి నోటీసుల ద్వారా సమాచారం అందించి ఊరుకుంటున్నారు. కానీ ఇప్పటినుంచి ఇలా కాకుండా కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనల రూపంలో అధికారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వాటిని పెద్దగా వినియోగించలేదు. ఇక నుంచి అలా చేస్తేనే మొండి బకాయిదారులు దారిలోకి వస్తారని భావిస్తున్న అధికారులు వ్యాపార సంస్థలను సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మియాపూర్ పరిధిలో సోమవారం ఒక దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. తద్వారా ఇతరులు వెంటనే పన్నులు, ఫీజులు చెల్లిస్తారని అధికారులు ఆశిస్తున్నారు.
ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజులను చెక్కుల రూపంలో అందించే ఆస్తిపన్నుదారులు ఒకవేళ తమ అకౌంట్లలో అందుకు సంబంధించిన మొత్తాన్ని నిల్వగా ఉంచకుంటే చెక్ బౌన్స్ అవుతుంది. దీంతో ఇలాంటి వారికి నిబంధనల ప్రకారం ‘ఇన్‌స్టుమ్రెంట్ యాక్ట్’ కింద నోటీసు ఇచ్చి తిరిగి చెల్లించేందుకు 15 రోజుల పాటు అవకాశం ఇస్తారు. ఒకవేళ చెల్లించకుంటే స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి తుది నోటీస్ జారీ చేస్తారు.
అయినప్పటికీ చెల్లించనట్లయితే ఎఫ్ఐఆర్ నమోదుకు కూడా వెసులుబాటు ఉందని అధికారి ఒకరు తెలిపారు. పన్నుదారులు ఇంకా మొండిగా వ్యవహరిస్తే వారి వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయేలా దుకాణాలు, వ్యాపార సంస్థలను సీజ్ చేస్తారు. వాస్తవానికి ఈ నిబంధనలు గతంలో కూడా ఉన్నప్పటికీ వినియోగించేంత అనివార్యత ఏర్పడలేదు. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలంటూ ఉన్నతాధికారులు చేసే ఒత్తడి దృష్య్టా అధికారులు ఈ దిశగానే అడుగులు వేయనున్నట్లు తెలుస్తున్నది.