సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో డెంగీ వ్యాధి నివారణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన, నివారణ చర్యలు చేపడుతున్నట్లు ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని, యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఐఈసీ కార్యక్రమాలు, దోమల ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లపై దృష్టి సారించినట్లు చెప్పారు.
నీరు నిల్వ ఉండే ప్రాంతాలైన నాలాలు, కుంటలు, చెరువుల అంచుల్లో నూనె బంతులు (ఆయిల్ బాల్స్) వేస్తామన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దోమల నివారణ, వచ్చే వ్యాధులపై సర్కిల్ పరిధిలో విద్యార్థులతో పాటు బయాలజీ టీచర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇప్పటి వరకు 232 కళాశాలలు, 2,262 పాఠశాలల్లో అవగాహన కల్పించామన్నారు.