అదే ధైర్యం.. అదే నిజాయతీ.. మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన సమయంలో కవిత ఎలాగైతే ధైర్యంగా వెళ్లారో.. అంతే ధైర్యంతో నగరానికి తిరిగొచ్చారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్’ అని నిరూపించారు. రాజకీయ కక్ష సాధింపునకు జడవలేదు.. నెలల తరబడి జైలులో పెట్టినా తలవంచలేదు.. ఆరోగ్య సమస్యలు చుట్ట్టు ముట్టినా బెదరలేదు.. ఎంతో సహనంతో న్యాయ విచారణ ఎదుర్కొన్నారు. ఏ తప్పు చేయని తనకు.. న్యాయమే దక్కుతుందని బలంగా విశ్వసించారు. చివరికి న్యాయమే గెలిచింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం నగరానికి వచ్చిన కవితకు అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు, గులాబీ శ్రేణులు ఆమెపై పూలవర్షం కురిపించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
MLC Kavitha | ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్’..జై కవితక్క.. న్యాయం గెలిచింది.. బీఆర్ఎస్ జిందాబాద్’.. నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం దద్దరిల్లింది. అభిమానులు, గులాబీ శ్రేణులు ఎమ్మెల్సీ కవితపై పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు.
అభిమానులు ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అందరికీ అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత ముందుకు కదిలారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో రాత్రి 7:30 గంటలకు బంజారాహిల్స్‌లోని ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులు సందడి చేశారు. ఐదు నెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు చేరుకోగా, ఆమె వెంట భర్త అనిల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
సందడే సందడి..
సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్సీ కవితకు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటి వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు నృత్యాలు చేస్తూ అలరించారు. ‘మా ఇంటి బతుకమ్మ వచ్చిందం’టూ మంగళహారతి పట్టారు. ఇంటికి చేరుకున్న కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ పేరుపేరునా అందరిని పలకరించారు. కవితతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
సోదరుడి చేయి పట్టుకొని..
సోదరుడు కేటీఆర్ చేయి పట్టుకొని కవిత వస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేశాయి. జై కేటీఆర్, జై కవితక్క.. అంటూ నినదించారు. ఇంటికి చేరుకున్నాక కేటీఆర్‌కు కవిత రాకీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యామంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. రాఖీ పండుగ రోజు కవిత లేని లోటును గుర్తు చేసుకొని కుటుంబసభ్యుల కండ్లు చెమ్మగిల్లాయి.
సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కడుతున్న వీడియో అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చిందని పలువురు పోస్టులు పెట్టారు. కవితపై అక్రమంగా కేసు బనాయించి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టడం అన్యాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు. కవిత విడుదలైన సందర్భంగా కువైట్‌లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.