ఖైరతాబాద్, జనవరి 13 : ‘నీరా’కు ‘వేదామృతం’ అని పేరు పెట్టడం సమంజసమని గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నీరా’ హబ్‌కు ‘వేదామృతం’ అని పేరు పెట్టడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘాలు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రమేశ్‌బాబు గౌడ్ మాట్లాడుతూ.. ‘నీరా’ అనేది ఎన్నో ఔషధ విలువలున్న పానియమని, కొబ్బరి నీరు ఎంత స్వచ్ఛమైనదో నీరా కూడా అంతే స్వచ్ఛమైందన్నారు. సనాతన ధర్మంలో తాటి చెట్టుకు ఎంతో సముచిత స్థానాన్ని కల్పించారని, తమిళనాడు ప్రభుత్వం 1978లో ఈ చెట్టుకు విశేషమైన ఔషధ, ఆర్థిక ప్రయోజనాలను గుర్తించి తమ అధికారిక వృక్షంగా స్వీకరించిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం తాటి చెట్టు విశిష్టతను చెబుతూ ఆంధ్ర కల్పవృక్షంగా పేర్కొంటూ పాఠాన్ని బోధించారన్నారు.
వేదాలు లాంటి అనేక పురాతన గ్రంథాలు తాటి ఆకులపైనే లిఖించారని, ఆ క్రమంలో ‘వేదామృతం’ అని పేరు పెట్టడంలో తప్పేముందన్నారు. బ్రాహ్మణుల పౌరోహిత్య మాదిరిగానే గీత వృత్తి కూడా ఎంతో పవిత్రమైందన్నారు. ‘నీరా’ కేంద్రాన్ని ప్రభుత్వం ‘వేదామృతం’ అని పేరు పెట్టడాన్ని హర్షిస్తున్నామని, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్లకు ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆయా సంఘాలు బేషరతుగా గౌడలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, కార్యనిర్వహణ అధ్యక్షుడు భిక్షపతి గౌడ్, గోపా నాయకులు వంగ రాములు గౌడ్, అనంత ఆంజనేయులు గౌడ్, పంజాల రాజు గౌడ్, పొన్నం దేవరాజు గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, ఆనంద్ గౌడ్, సైదులు గౌడ్, మీరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.