మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజల ఇండ్లను కూల్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గడంలేదు. ఒకవైపు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నా.. మరోవైపు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఈ క్రమంలోనే బాపూఘాట్ నుంచి హిమాయత్ సాగర్ దాకా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ఏండ్ల తరబడిగా నివసిస్తున్న ఇండ్లు, పట్టా భూములను ఇవ్వబోమంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు.
– సిటీ బ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ)
బాపుఘాట్ సమీపంలోని రక్షణ శాఖ భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కట్టేందుకు అనుమతులు ఇవ్వడం కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టింది. మూసీ పరీవాహకంలోని పేదల ఇండ్లను దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. ఇందులో ఏ-గా రేవంత్‌రెడ్డి, ఏ-2గా కిషన్‌రెడ్డి. ఇద్దరూ బహిరంగంగా తిట్టుకుంటూ లోపాయికారంగా బస్తీల ప్రజలను దోచుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. బస్తీ నిద్ర పేరిట పేదలను మోసం చేసిన కిషన్‌రెడ్డిని మూసీ పరీవాహక ప్రాంతానికి రాకుండా అడ్డుకుంటాం. మూసీ పేరిట కాంగ్రెస్-బీజేపీ చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకు బస్తీలను ఏకం చేస్తాం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా నిరంతరం నిలదీస్తాం.

సిటీ బ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) తాజాగా బండ్లగూడ, హైదర్‌గూడ పరిసరాల్లోని రక్షణ శాఖకు సంబంధిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. 83 ఎకరాల భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేసుకునేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అనుమతులు ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వమే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కుమ్మక్కై తమ భూములను లాక్కొనేందుకు సిద్ధమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ భూములకు అనుతిచ్చినంత మాత్రాన తమ ఇండ్లను ఖాళీ చేయబోమని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు, హైదర్‌గూడలోని ఆయా కాలనీల ప్రజలు తేల్చిచెప్తున్నారు.
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని పరీవాహక ప్రాంతాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కా్రంగెస్ ప్రభుత్వం మూసీ పేరిట చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకుంటామని ప్రకటనలు చేసిన బీజేపీ.. కేంద్రం గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతులిస్తుంటే ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళనలు చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సమాయత్తం అవుతున్నారు. సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తమ ఇండ్లను కూల్చి, భూములను లాక్కుంటామంటే సహించమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవడం.. అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించడం ప్రజావ్యతిరేకమని మండిపడుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తేల్చి చెప్తున్నారు.
ప్రాజెక్టులు, విగ్రహాల నిర్మాణం పేరిట పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న మా ఇండ్లను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణ శాఖ భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు అనుమతులు లభించాయని తెలిసింది. దీన్ని బట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చీకటి స్నేహం బయటపడింది. కిషన్ రెడ్డి మూసీ బాధితుల కోసం చేసిన నిద్రలన్నీ నాటకాలేనని తేలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోయి ప్రజల ఇండ్లను కూల్చేందుకు వస్తే తిప్పికొడతాం. మా ఇండ్లు, భూములు కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్లి కొట్లాడతాం.
-మధుపార్క్ రిడ్జ్ నివాసితుడు