మేడ్చల్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్‌ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించడ లేదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరగ్గా.. బీఆర్ఎస్ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై అధికారులను ఎమ్మెల్యేలు నిలదీశారు.
ప్రొటోకాల్‌ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదు. స్థానిక ఎమ్మెల్యేకు అధికారులు ఎందుకు సమాచారం అందించడం లేదు. నూతనంగా ఏర్పాటు చేసిన అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. మేడ్చల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ గృహాలను స్థానికులకు కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రసుత్తం ఉన్న డబుల్ బెడ్రూమ్లలో మౌలిక వసతులు కల్పించాలి.
– మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురువుతున్నాయి. కబ్జాలను తొలగించేందుకు వెళ్లే అధికారులను ఆక్రమణదారులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉప్పల్‌లో వంద పడకల దవాఖాన మంజూరైనా ప్రభుత్వం ఈ దవాఖానకు స్థలం కేటాయించలేదు. దవాఖాన నిర్మాణానికి టెండర్లు పూర్తయినా స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
మల్కాజిగిరి నియోజకవర్గం కబ్జాలకు నిలయంగా మారింది. ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరినా అధికారులు సహకరించడం లేదు. కబ్జాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ భూములు సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలి. ప్రభుత్వ దవాఖానలో సిటీస్కాన్‌కు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. 15 ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులతో యూపీహెచ్‌సీలు నిర్మించాలి. ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి కిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మల్కాజిగిరిలో ఉన్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు తరలించి ఈ కార్యాలయాన్ని తరగతి గదులకు ఉపయోగించేలా చూడాలని చెప్పినా వినడం లేదు.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి