రవీంద్రభారతి, ఫిబ్రవరి 25: ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, స్వర్మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో సృజనోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి.రమణాచారి హాజరయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం దేశభక్తి, జాతీయ సమైక్యతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ, తెలంగాణ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు డా.కె.వి.రమణాచారి, మామిడి హరికృష్ణ, స్వర్ మహతి కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. బి.ఆదిత్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్లో.. ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన గవర్నర్
నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలందించే క్రమంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించారు. నిమిషానికి 250లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను డి.ఈ.షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సేవాభారతి సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసినట్లు దవాఖాన ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చెన్నైలో తాను చదువుకునే రోజుల్లో ఆంధ్ర మహిళా సభతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.షా ఇండియా డైరెక్టర్ చైతన్య గొర్రెపాటి, సేవా భారతి ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ అధ్యక్షురాలు ఉషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.