GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విస్తరణకు సంబంధించిన రెండు కీలక ఆర్డినెన్స్‌లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. తెలంగాణ క్యాబినెట్ నవంబర్ 25న ఆమోదించిన మున్సిపల్ చట్ట సవరణ, విస్తరణ ఆర్డినెన్స్‌లకు గవర్నర్ సోమవారం ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం కానుంది.
హైదరాబాద్ మహా నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనంతో ఉత్కంఠ వీడింది. రెండేళ్ల కాలంగా ఉన్న విలీన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకువచ్చిన సర్కార్.. ఔటర్ వరకు విస్తరించి 2వేల చదరపు కిలోమీటర్ల విశాలమైన నగరంగా గ్రేటర్ పరిధిని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే 51 శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా… ఇక అన్ని పురపాలికలను గ్రేటర్లో కలిపేయడంతో ఔటర్ రింగు రోడ్డు వరకు జీహెచ్ఎంసీగా మారనుంది. 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గ్రేటర్‌ను 2వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించడంతో ఇప్పుడు గ్రేటర్ జనాభా సుమారు మూడింతలు పెరగనుంది. అంటే గ్రేటర్ పరిధిలో 2కోట్ల జనాభా ఉండనుంది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ యాక్టులో సవరణలు చేసిన సర్కార్…. ఔటర్ పరిధిలో విస్తరించి ఉన్న 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలతో కలిపి మహానగర పాలికను విస్తరించింది.

ప్రస్తుతం విస్తీర్ణం పరంగా ఢిల్లీ, బెంగుళూరు మున్సిపాలిటీల తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. తాజా విలీనం పూర్తి అయితే ఇకపై దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా గ్రేటర్ హైదరాబాద్ మారనుంది. 1,400 చదరపు కిలోమీటర్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత 742 చదరపు కిలోమీటర్లతో బెంగుళూరు నగరపాలిక ఉంది. తాజాగా 27 పురపాలికలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పరిధి 2వేల చదరపు కిలోమీటర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖను ఔటర్ లోపల, ఔటర్ బయట ఉన్న ప్రాంతాలుగా విభజించి ఇద్దరు మున్సిపల్ సెక్రటరీలను నియమించింది. తాజా ఆమోదంతో గ్రేటర్‌లోనే ఔటర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు భాగం కానున్నాయి.