శంషాబాద్ రూరల్, ఆగస్టు 3 : ఇటీవల కాలంలో గురుకుల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతూ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వసతిగృహాలు సజావుగా పని చేయాలంటే అందులో పని చేస్తున్న సిబ్బందికి కూడా ప్రతినెల జీతాలు, ఇతర సదుసాయలు కల్పించాల్సిన సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఏళ్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయని సర్కార్ వారికి ప్రతి నెలా వేతనాలు అందించడంలోనూ, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది అధిక పనిభారంఎదుర్కొంటున్నారు.
ఖాళీగా 100కు పైగా పోస్టులు..
రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో దాదాపు 100 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. శంషాబాద్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో కొంతకాలం నుంచి వంటమనిషి లేరు. ఉన్న ముగ్గురు సిబ్బంది మాత్రమే అన్నీ తామై విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఒక్కరు పర్మినెంట్ కాగా మరో ఇద్దరు దినసరి కూలీలు. పిల్లల భోజన ఇతర సౌకర్యాలతో పాటు అందులో పని చేస్తున్న సిబ్బందికి ప్రతి నెల ప్రభుత్వం జీతాలు చెల్లించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తిచేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చొరవ తీసుకోవాలి.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ హాస్టళ్లలో పనిచేసే సిబ్బందికి వేతనాలు సరిగా అందించడం లేదనే విమర్శలున్నాయి. నాణ్యమైన భోజనం అందిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆభోజనాన్ని వండిస్తున్న వారిని మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఎన్నికలపుడు అనేక హామీలు ఇచ్చిన నాయకులు తర్వాత తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
కుటుంబ పోషణ భారంగా ఉంది
36 ఏండ్లుగా ఎస్సీ హాస్టల్ వంటగదిలో దినసరి కూలీగా పని చేస్తున్నాను. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నా ఇప్పటివరకు పర్మినెంట్ కాలేదు.ప్రతి నెలా జీతం కూడా సరిగా ఇవ్వటం లేదు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. జీతాలు లేకుంటే కుటుంబ పోషణ ఎలా చేయాలి. అందరికి న్యాయం చేస్తామని గొప్పలు చెప్పుకుంపటన్న ప్రభుత్వం మాకు మాత్రం ప్రతి నెల జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. వెంటనే జీతాలు చెల్లించాలి.
– బుచ్చయ్య, వంటగది దినసరికూలీ,శంషాబాద్ ఎస్సీ బాలికల హాస్టల్