బంజారాహిల్స్, అక్టోబర్4: దసరా సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల స్థలంపై మరోసారి ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. రాత్రికి రాత్రే స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తుడిచివేయడమే కాకుండా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. . షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీ, టీఎస్ నంబర్ 1/పార్ట్, బ్లాక్ హెచ్, వార్డు-10లోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎకరన్నర స్థలాన్ని జలమండలి కోసం కేటాయించగా, మరో మూడున్నర ఎకరాల స్థలం ఖాళీగా ఉంది.
సుమారు రూ.400 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎకరన్నర స్థలం జలమండలి విజిలెన్స్ విభాగం ఆధీనంలో ఉండగా, మూడున్నర ఎకరాల స్థలం షేక్‌పేట మండల రెవెన్యూశాఖ ఆధీనంగా ఉంది. అయితే ఈ స్థలం సర్వే నంబర్ 403/52 నంబర్‌లోకి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా పరుశరాం పార్థసారథి అనే వ్యక్తితో పాటు అతడి కొడుకు విజయ్ భార్గవ్ వివాదాలు సృష్టించడంతో పాటు పలుమార్లు స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, వారు చెబుతున్న సర్వే నంబర్ రెవెన్యూ రికార్డులలోనే లేవని, బోగస్ పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇప్పటికే వారిపై అనేకసార్లు క్రిమినల్ కేసులు నమోదవ్వడం తెలిసిందే. నూకల రాఘవరావు, మేర్ల నారాయణ కుటుంబసభ్యులు తమకు డెవలప్మెంట్ ఇచ్చారంటూ వీఆర్ ఇన్ఫ్రా పేరుతో పార్థసారథి కొడుకు విజయ్‌భార్గవ్ మరోసారి కోర్టును ఆశ్రయించగా హైకోర్టు వేర్వేరుగా రెండు స్టేలు మంజూరు చేయడం..
నెలరోజుల కిందట పెద్ద ఎత్తున రౌడీలు, మహిళలతో వచ్చిన కింగ్డమ్ రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పీ తరఫున వచ్చామని, తమకు విద్యాసాగర్ అనే వ్యక్తి వారసులు స్థలాన్ని డెవలప్మెంట్ ఇచ్చారంటూ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు సంస్థలకు చెందిన పత్రాలు బోగస్‌వే అని, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని షేక్‌పేట తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో నెలరోజుల కిందట బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పుడే స్థలంలో వెలిసిన ఆక్రమణలను తొలగించడంతో పాటు ప్రైవేటు సంస్థల పేర్లతో ఏర్పాటు చేసినబోర్డులను రెవెన్యూ సిబ్బంది తొలగించి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అప్పటినుంచి మౌనంగా ఉన్న కబ్జాదారులు మరోసారి స్థలంపై కన్నేశారు. దసరా సందర్భంగా వరుస సెలవులు రావడంతో రాత్రికి రాత్రే స్థలంలోకి ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్డువైపున గేట్లతో పాటు స్థలం చుట్టూ సుమారు 10 దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లమీద సైతం కెమెరాలు ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో పాటు స్థలంలోపల, బయట రాసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తుడిచేశారు.
కాగా ఇక్కడి స్థలంలో బందోబస్తుగా ఉన్న జలమండలి విజిలెన్స్ విభాగం సిబ్బంది ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటే ఏమయ్యారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకే ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.