
ఆర్థికంగా అండగా నిలవాలనుకునే వారు కొందరే ఉంటారు. సామాజిక స్పృహ, బాధ్యత కలిగి ఏదోవిధంగా చేయూతనిచ్చేందుకు ముందుకొస్తారు. ఓ ఎన్నారై తోడ్పాటుకు స్థానికులు, స్కూల్ ఉపాధ్యాయులు జతకలవడంతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మారుమూల కొత్తపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దశ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఇప్పుడు కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక హంగులు అద్దుకున్నది. దుబాయ్‌లో ఆర్థికంగా స్థిరపడిన స్థానికుడైనా ఉమర్ వహల్వాన్ సుమారు రూ.కోటి వెచ్చించి 16 గదులతో జీ+1 భవనాన్ని నిర్మించి ఇచ్చారు. పనుల పర్యవేక్షణ, ఇతరత్రా వ్యవహారాలన్నీ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. టీచర్లు, ప్రజాప్రతినిధులు, దాతల సాయంతో మౌలిక వసతులు కల్పించడంతో ఈ ఏడాది ఏకంగా 256 నూతన అడ్మిషన్లు జరిగాయి. పాఠశాల పునఃప్రారంభం కావడంతో నాలుగురోజులుగా కళకళలాడుతోంది.

మణికొండ: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని జడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. నిత్యం విద్యార్థులు ఇబ్బందిపడుతుండడంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద ఎమ్మార్ ప్రాపర్టీస్, నొవాటెల్, రౌండ్‌టేబుల్ సంస్థలు రూ.60 లక్షలు వెచ్చించి మూడు అంతస్థుల్లో నూతన భవనాన్ని నిర్మించాయి. బల్ల్లలు, ప్రొజెక్టర్లు, తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులు కల్పించాయి. శనివారం ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో సాదాసీదాగా నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల అంటే ఎవరికీ పట్టదు. సర్కారు అడుగు ముందుకేస్తే తప్ప ఆ పాఠశాల బాగుపడదనేది జగమెరిగిన సత్యం. కానీ బాలాపూర్ మండలం కొత్తపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల మాత్రం ఇందుకతీతం.
ఆ చదువుల ఒడిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించారు. స్థానిక ఎన్నారై.. ప్రజాప్రతినిధులు.. పాఠశాలలోని ఉపాధ్యాయులు.. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులు.. ఎవరికి వారు తలోచేయి వేశారు. ఒకరు ఆర్థికంగా ఆదుకుంటే.. మరొకరు అంకితభావంతో పని చేశారు.. ఇంకొకరు తమ బాధ్యతగా చిన్న అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చారు. సరిపడా ఉపాధ్యాయులు లేకపోతే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులు ముగ్గురు ఉచితంగా విద్యా బోధన చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇంకేముంది..కార్పొరేట్‌కు దీటుగా నిలిచిన ఈ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు క్యూ కట్టారు. కేవలం ఈ ఒక్క ఏడాదే ఏకంగా 256 కొత్త అడ్మిషన్లు నమోదవడంతో ఆ పాఠశాల నిండుగా చిన్నారులతో కళకళలాడుతున్నది. సర్కారు బడి అంటే కేవలం ప్రభుత్వమే కాదు.. ప్రతిఒక్కరూ బాధ్యతగా భావిస్తే ఆణిముత్యాల్లాంటి భావి భారత పౌరుల్ని తయారు చేయడమనేది మన చేతుల్లోనే ఉందనేందుకు ఇదో నిలువెత్తు నిదర్శనం.

గురువు అంటే కేవలం విద్యాబుద్దులు నేర్పడమే కాదు… ఆ పాఠశాలను ఆదర్శంగా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు కించిత్తు ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి. కొత్తపేట పాఠశాల విద్యార్థులకు ఆ అవకాశం అక్కడున్న ఉపాధ్యాయుల రూపంలో దక్కింది. కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా ప్రతి నిత్యం పాఠశాల మౌలిక వసతులపై స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులను కలవడం వాటిని సమకూర్చడం ఒక విధిగా పెట్టుకున్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ షాహీనా కూడా వీరికి బాసటగా నిలిచారు. ఆమె ప్రతిరోజు అక్కడే ఉండి విద్యార్థుల మౌలిక వసతుల్ని దగ్గర ఉండి చూసుకుంటారు. అంతేకాక ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ తరగతి గదులను శుభ్రం చేయించడంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా సిద్ధం చేయిస్తారు.

ముగ్గురు ఉపాధ్యాయులు సొంతంగా డబ్బులు వెచ్చించి పాఠశాలలో అదనపు టాయిలెట్స్ నిర్మాణం చేయించారు. ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలకు రంగులు వేయించారు. విద్యార్థుల కోసం ఫిల్టర్ వాటర్ వారే కొనుగోలు చేస్తున్నారు. మాస్క్‌లు, డ్రస్సులు సైతం అందజేస్తున్నారు. దాతల సాయంతో స్కూల్ దుస్తులు, ప్లేట్స్, మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యుల దగ్గరకు తీసుకు పోయి వైద్యం చేయిస్తారు. విద్యార్థులను అన్ని తామై చూసుకుంటున్నారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు.

కొత్తపేట పాఠశాలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం అప్‌గ్రేడ్ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చడంతో అదనంగా రెండు తరగతులు పెరిగాయి. అయితే అప్పటికే ఎన్నారై అందమైన భవనం నిర్మించడంతో వసతికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అన్నిరకాల వసతులు ఉండటంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే పాఠశాలలో ఏకంగా 256 కొత్త అడ్మిషన్లు నమోదు కావడంతో విద్యార్థుల సంఖ్య 356కి చేరింది. ఇదే ఏడాది అప్‌గ్రేడ్ కావడంతో ఇంకా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు పాలనాపరంగా కొంత సమయం పట్టనుంది. దీంతో గతంలోని ముగ్గురు ఉపాధ్యాయులే ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ స్వచ్ఛందంగా చదువు చెప్పేందుకు ముందుకొచ్చారు.
అదనపు ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యార్థుల తల్లులు ముగ్గురు షాబియా బేగం, మెహక్ సుల్తానా, శభానా బేగం ఉచితంగా ఈ విద్యా సంవత్సరం చదువు చెప్పేందుకు ముందుకు రావడంతో విద్యా బోధనలో ఇబ్బందులు తొలిగాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పలుచగానే ఉంది. కానీ కొత్తపేట యూపీఎస్ మాత్రం విద్యార్థుల సందడితో కళకళలాడుతున్నది. మొత్తం విద్యార్థులు 356 ఉండగా… పాఠశాలల పునః ప్రారంభం రోజు 200 మంది, రెండో రోజు 195, మూడో రోజు 195 మంది విద్యార్థులు హాజరయ్యారు. శనివారం కూడా పదుల సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించేందుకు పాఠశాలకు వచ్చారు. అయితే సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఏం చేయాలనే దానిపై ఉపాధ్యాయులే తర్జనభర్జన పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అవకాశాలు కల్పిస్తామని ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్రెడ్డి అన్నారు.
కందుకూరు, సెప్టెంబర్ 4: పాఠాలు బోధించడమే కాదు విద్యార్థుల ఆకలి తీర్చింది. స్వయంగా వంట వండి 20 మందికి పెట్టింది. కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. శనివారం విద్యార్థులందరూ పాఠశాలకు రాగా.. మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి మాత్రం రాలేదు. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయురాలు లావణ్య రంగంలోకి దిగింది. 20 మంది విద్యార్థులకు వండి పెట్టగా వారంతా తృప్తిగా భోజనం చేశారు
హైదరాబాద్ మహా నగరానికి అతి సమీపంలో ఉందన్న పేరేగానీ.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని కొత్తపేట మారుమూలన ఉన్నట్టుగా ఉంటుంది. నిన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. దీంతో ఆరో తరగతి నుంచి చదవాలంటే.. కిలోమీటర్ల దూరంలోని బాలాపూర్ లేదా బడంగ్‌పేట వెళ్లాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో అనుకోని రీతిలో ఆ పాఠశాలకు మహర్దశ వచ్చింది. స్థానికుడైన ఉమర్ వహల్వాన్ దుబాయ్‌లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. ఈ పాఠశాలను బాగుపరచాలనే మంచి ఉద్దేశంతో ఆయన పాత భవనం స్థానంలో కొత్త భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. దాదాపు కోటి రూపాయలకు పైగా వెచ్చించి 16 గదులతో జి+1 భవనాన్ని నిర్మించి ఇచ్చారు. మరి.. ఆయన ఆర్థికంగా ముందుకొచ్చినా నిర్మాణ పనుల్ని పర్యవేక్షించడం, ఇతరత్రా వ్యవహారాలన్నీ చూడటం కూడా కీలకమే. అందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్రెడ్డి, మరో ఇద్దరు ఉపాధ్యాయులు దగ్గర ఉండి ఆ పనుల్ని పర్యవేక్షించారు. నిర్మాణ సమయంలో ప్రతిరోజు ఇద్దరూ వచ్చి క్యూరింగ్ (నీళ్లు కొట్టడం) స్వయంగా చేశారు. ఫలితంగా కొత్తపేట పాఠశాలకు కార్పొరేట్‌కు దీటుగా అందమైన భవనం తయారైంది.

మణికొండ, సెప్టెంబర్ 4: విద్యాభివృద్ధిలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. పేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్‌ను అందించాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా అందంగా పాఠశాల భవనాన్ని నిర్మించారు. అందులో సకల సదుపాయాలు కల్పించారు ఎమ్మార్ ప్రాపర్టీస్, నొవాటెల్, రౌండ్‌టేబుల్ సంస్థ సభ్యులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలోని నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందరికో విద్యాబుద్ధులు నేర్పింది. ఒకప్పుడు ఇక్కడ చదువుకున్న వారంతా రాజకీయంగా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ప్రస్తుతం ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరగా.. ఎమ్మార్ ప్రాపర్టీస్, నొవాటెల్, రౌండ్‌టేబుల్ సంస్థలు కలిసి ఆ స్థలంలో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించాయి. అందులో నాలుగు తరగతి గదులతో పాటు మరో భవనంపై మరో అంతస్థును నిర్మించాయి.
ఇందుకోసం ఏకంగా రూ.60 లక్షలు ఖర్చు చేశాయి. విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా బల్లలు, పాఠాలు వినేందుకు ప్రొజెక్టర్లు, తాగునీరు, మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చాయి. శనివారం పాఠశాల భవనాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ సీఎఫ్ఓ మధుసూదన్‌రావు, నొవాటెల్ జనరల్ మేనేజర్ మనీష్ దవ్వ మాట్లాడుతూ విద్యతోనే అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రాధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలను పునర్మించి మౌలిక సదుపాయాలు కల్పించిన ఎమ్మార్ ప్రాపర్టీస్, నొవాటెల్, రౌండ్ టేబుల్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తపేట యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూప్తున్నారు. అడ్మిషన్లు అయిపోయాయని చెప్పినా వస్తున్నారు. అప్‌గ్రేడ్‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెరగాల్సి ఉంది. అధికారులు వెంటనే ఆ సమస్యను తీరిస్తే బాగుంటుంది. ముగ్గురు పేరెంట్స్ తల్లులు విద్యా బోధనకు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఊరట కలిగించింది. చుట్టుపక్కల సమీపంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలు లేనందున ఇదే పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలి. – అమర్నాథ్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు
ఇంటర్ చదివిన నాకు గతంలో మూడు సంవత్సరాల విద్యా బోధన చేసిన అనుభవం ఉంది. ప్రైవేటు పాఠశాలలో పని చేసినప్పుడు నెలకు ఆరు వేల జీతం వచ్చేది. ఈ పాఠశాలలో మా పిల్లలు ముగ్గురిని చేర్పించా. విద్యార్థుల సంఖ్య భారీగా ఉన్నా, సరిపోను ఉపాధ్యాయులు లేరు. దీంతో నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బోధన చేస్తానని చెబితే ప్రధానోపాధ్యాయులు అవకాశం ఇచ్చారు. నాకు వేతనం ముఖ్యం కాదు.. మా పిల్లలతో పాటు వందలాది పిల్లలు బాగుపడతారనే సంతృప్తి చాలు. – షభాన బేగం
నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. గృహిణిగానే ఉన్నాను. ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందంటే బోధన చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చా. మా పిల్లలు ఇదే పాఠశాలలో ఉన్నారు. నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే నా పిల్లలతో పాటు ఇతర పిల్లలకు చదువు చెబితే నేను చదివిన చదువుకు సార్థకత లభిస్తుందని ఆలోచించా. -షాబియా బేగం