Dhurandhar | రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తన జోరు ఇంకా తగ్గించలేదు. విడుదలై ఆరు వారాలు పూర్తయినా, ఈ సినిమా కలెక్షన్ల పరంగా రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తూ ఇండియన్ సినీ పరిశ్రమలో అరుదైన ఘనతలు సాధిస్తోంది. ముఖ్యంగా విడుదలైన 42వ రోజున కూడా భారీ వసూళ్లు రాబట్టి సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండియన్ సినిమాల చరిత్రలో 42వ రోజున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ నిలవడం విశేషం. జనవరి 15న మాత్రమే ఈ చిత్రం సుమారు రూ.3 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఛావా (రూ.1.35 కోట్లు) పేరిట ఉండగా, దాన్ని భారీ తేడాతో ధురంధర్ బ్రేక్ చేసింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బలమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.28 కోట్ల ఓపెనింగ్‌తో మొదలైన ఈ చిత్రం, తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను దాటేసింది.
మొదటి వారాంతం ముగిసే సరికి దాదాపు రూ.103 కోట్ల వసూళ్లు నమోదు చేసి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తొలి వారం మొత్తం కలెక్షన్లు రూ.207 కోట్లకు పైగా ఉండటం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. రెండో వారం వచ్చాక కూడా గ్రాఫ్ పడిపోకుండా మరింత బలంగా నిలిచింది. ముఖ్యంగా వీకెండ్లలో ప్రేక్షకుల తాకిడి పెరగడంతో 9వ, 10వ రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. రెండో వారం ముగిసే సరికి మరో రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత మూడో, నాలుగో వారాల్లోనూ సినిమా స్థిరమైన రన్ కొనసాగిస్తూ వరుసగా రూ.172 కోట్లు, రూ.106 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఐదో వారం, ఆరవ వారాల్లో కొత్త సినిమాల పోటీ ఉన్నప్పటికీ ధురంధర్ తన స్క్రీన్లను నిలబెట్టుకుని మంచి వసూళ్లు రాబట్టింది. 39వ రోజు నుంచి 42వ రోజు వరకూ రోజుకు రూ.2 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్లు రావడం ఈ సినిమాకు లభించిన అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దేశీయంగా ఈ చిత్రం దాదాపు రూ.817 కోట్ల నికర వసూళ్లు నమోదు చేయగా, భారతదేశ గ్రాస్ కలెక్షన్లు రూ.976 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్లలో కూడా రూ.293 కోట్ల వరకు వసూలు చేసి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.1,270 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.మొత్తంగా చూస్తే, ధురంధర్ కేవలం ఒక హిట్‌గా మాత్రమే కాకుండా, దీర్ఘకాలం బాక్సాఫీస్‌పై ఆధిపత్యం చూపిన అరుదైన ఇండియన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంకా థియేటర్లలో కొనసాగుతున్న ఈ సినిమా రన్ చివరికి ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.