చిక్కడపల్లి, జూలై 7 : తెలంగాణషాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988 లోని సెక్షన్ 16, 17లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 282ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ధర్నాకు దిగారు. జీవో నం. 282 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవో కాపీలను దహనం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్రాజ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యం, ఐఏన్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనూరాధ, టీఎన్ట్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకె. బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్చార్జి భరత్ మాట్లాడారు.
తక్షణమే జీవో 282 రద్దు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. జీవో నం. 282 కాపీని దహనం చేసిన అనంతరం ఆర్టిసి క్రాస్ రోడ్స్ నుంచి లేబర్ కమిషనర్ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ధర్నా అనంతరం అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ కు వినతి పత్రం ఇచ్చారు. సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్, ఏఐటీయూసీ సిటీ కార్యదర్శి బాలరాజులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.