సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా..ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్, స్వచ్ఛ హైదరాబాద్ వంటి ర్యాంకులతో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ గడిచిన ఏడాది కాలంగా టాయిలెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. కనిపించని పబ్లిక్ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్ఎంసీకే చెల్లింది. ప్రతి అరకర కిలోమీటరు రద్దీ రోడ్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ప్రస్తుతం ఆరు జోన్లలో 4826 సీట్లలో 1857 పబ్లిక్ టాయిలెట్లను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ముఖ్యంగా 1385 చోట్ల మాత్రమే టాయిలెట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు కమిషనర్‌కు నివేదిక ఇటీవల అందజేశారు. అంటే 472 చోట్ల టాయిలెట్లు వినియోగంలోకి లేవని, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై కమిషనర్ ఇలంబర్తి సీరియస్ అయినట్లు తెలిసింది. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ర్యాంకుల ప్రకటన సందర్భంగా సర్వే జరుగుతున్న దరిమిలా పబ్లిక్ టాయిలెట్లను నిర్వహణ అంశాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ టాయిలెట్ల అన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాయిలెట్ల క్షేత్రస్థాయిలో లేకున్నా వాటి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నట్లు, ఇందులో కొన్ని ఏజెన్సీలతో అధికారులు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో సగానికి పైగా వినియోగంలో లేవని, కొన్ని చోట్ల గాయబ్ అయ్యాయని, బిల్లులు చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల నల్లాలు, డోర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవ్వడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారికి ‘అర్జెంట్ ’ అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి నెలకొనడం విచారకరం.
ఆర్టీసీ బస్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు , పార్కుల వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్లలో చాలా వరకు ప్రస్తుతం కనిపించడం లేదు. వాస్తవానికి కమర్షియల్ ఏరియాల్లో ఉండే టాయిలెట్లను రోజుకు నాలుగు సార్లు, నాన్ కమర్షియల్ రోజుకు కనీసం మూడు సార్లు టాయిలెట్లను క్లీన్ చేయాల్సి ఉంది. డైలీ క్లీనింగ్ చేస్తున్నారా? అంటే లేదనే స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని టాయిలెట్లకు కనీసం డోర్లు కూడా ఉండడం లేదని చెబుతున్నారు. వీటికి తోడు టాయిలెట్లలో వాటర్ కూడా అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. ‘పే అండ్ యూజ్’ , బస్టాప్‌ల వద్ద ఉండే సులభ్ కాంప్లెక్స్‌లను ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం.
వాస్తవంగా స్వచ్ఛ భారత్ మిషనర్ (పట్టణ) మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్లు మార్కెట్లు, రైల్వే స్టేషన్లు , పర్యాటక స్థలాలు, కార్యాలయ సముదాయాల సమీపం, ప్రయాణ ప్రదేశాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలి. గ్రేటర్లో 2వేల వరకు పబ్లిక్ టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ 1385 మాత్రమే ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.