సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు వికేంద్రీకరణలోనూ ఒంటెద్దు పోకడలను అవలంబిస్తోంది. విలీనంలో భాగంగా ఇప్పటికే తుక్కుగూడ బడంగ్‌పేట మున్సిపాలిటీలోని సబ్బండ వర్గాలు సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్న క్రమంలో సోమవారం ప్రభుత్వం జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజిస్తూ జీవో నం. 266ను జారీ చేసింది.
తక్షణమే డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముసాయిదాను విడుదల చేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ తదుపరి ప్రక్రియను చేపట్టనున్నారు. రాబోయే రెండు రోజుల్లోగా ముసాయిదాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డివిజన్ల సంఖ్య ఖరారులలో భాగంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి విభజన ప్రక్రియ ప్రారంభం కానున్నది. లక్ష జనాభా ఉండగా, రెండు డివిజన్లకు విభజించనున్నారు. కీరసర ప్రాంతం తొలి డివిజన్‌గా స్థానం దక్కించుకోనున్నది.
ఆ తర్వాత రెండో స్థానంలో దమ్మాయిగూడ నిలువనున్నది. ఈ తరహాలో వార్డుకు 40వేల నుంచి 50వేల జనాభా చొప్పున 300 డివిజన్లను ఖరారు చేస్తారు. పునర్విభజనలో భాగంగా రెండు రోజుల్లో కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసి వారం రోజుల గడువుతో పౌరుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. తదుపరి ఫైనల్ నోటిఫికేషన్ అనంతరం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నారు. అనంతరం ఈ నివేదికను సర్కార్‌కు అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ 300 డివిజన్లుగా గెజిట్ జారీ చేస్తారు. ప్రస్తుత పాలక మండలి గడువు ముగింపు ఫిబ్రవరి 11 తర్వాత జీహెచ్ఎంసీని ఒక కార్పొరేషన్ చేస్తారా ? ముక్కలుగా విభజిస్తారా అన్నది తేలాల్సి ఉంటుంది.
జీవో 266 ప్రకారం….
మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ జారీ చేసిన ఈ జీవో ప్రకారం జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్ అధ్యయన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలో, విస్తరించిన నగర పరిమితులు, జనాభా గణాంకాలు, సేవల డెలివరి అవసరాల ప్రకారం 300 వార్డులు అవసరమని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం కొత్త వార్డు సంఖ్యను ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఎక్స్ట్రార్డినరీ గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించారు. ముద్రణ శాఖకు 500 ప్రతులను ప్రభుత్వానికి అందించాలని కూడా సూచించారు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన, భవిష్యత్తులో జరగపోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనున్నది.
ఓ వైపు నిరసనలు.. మరో వైపు వికేంద్రీకరణకు అడుగులు
నగరాభివృద్ధి పట్ల ఎలాంటి చర్చలు లేకుండానే సర్కారు తనదైన శైలీలో దూకుడు కొనసాగిస్తోంది. విలీన మున్పిపాలిటీల్లో పాలనాపరమైన సమస్యలు ఒకవైపు, మరోవైపు తుక్కుగూడను గ్రేటర్లో విలీనం చేయొద్దంటూ ఆల్ పార్టీ జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో అందోళన వ్యక్తం చేశారు. బడంగ్‌పేట మున్సిపాలిటీని చార్మినార్‌లో కలపవద్దంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానికులు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియలో శాస్త్రీయత పాటించలేదని, సరిహద్దుల నిర్థారణలో అనేక సమస్యలు ఉన్నాయంటూ అధికార పార్టీ నేతలు, పలువురు శివారు ఎమ్మెల్యేలను జీహెచ్ఎంసీ కమిషనర్‌పై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. ఇదే బాటలో గ్రేటర్ లోని మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జాప్యానికి కారణమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నప్పటికీ ముసాయిదా సమయంలోనే ముసలం పుట్టడంతొ అధికారుల ఈ బంతిని సర్కారు కోర్టులోకి పడేశారు.
ఒత్తిళ్లు వస్తున్నా ముందుకే..
వార్డులగా విభజించి పునర్విభజన ముసాయిదాను మూడు రోజుల క్రితమే జారీ చేసేందుకు హడావుడి జరిగినా, నోటిఫికేషన్ జారీ కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. విలీన నేపథ్యంలో మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ సీజీజీలో జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీల పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సీజీజీ ప్రతినిధులు పునర్విభజనపై దాదాపు 10 రోజుల పాటు కసరత్తు చేశారు. విలీనం, వార్డుల పునర్విభజన ప్రక్రియను జీహెచ్ఎంసీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లు ఇప్పటికే ముసాయిదాను సిద్దం చేసి చీఫ్ సెక్రటరీకి అందజేశారు. తుకుగూడ, బడంగ్‌పేట స్థానిక సంస్థలను చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో విలీనం చేయాలని శివారు ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి జీహెచ్ఎంసీ కమిషనర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లపై పలు సార్లు ఒత్తిడి చేశారు. ఈ రకంగా గ్రేటర్‌లోని మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హడవుడి విలీన ప్రక్రియ చేపట్టడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.
నేడు ముసాయిదా విడుదల..
జీహెచ్ఎంసీ పాత పరిధిలోని 150 మున్సిపల్ వార్డులను 260 నుంచి 270 వరకు విభజించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇక ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలను 30 నుంచి 40 వార్డులుగా విభజించి, మొత్తం 300 వార్డులుగా ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. ఒక మున్సిపల్ వార్డు పరిధి రెండు సరిళ్ల పరిధిలోకి రాకుండా, ఒక సరిల్ పరిధి 2 జోన్ల పరిధిలోకి రాకుండా పునర్విభజన ముసాయిదాను తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతమున్న ఆరు జోన్లను పది జోన్లుగా, ఒకో జోన్ లో 30 వార్డులు వచ్చేలా ముసాయిదా రూపకల్పన చేసినట్లు అధికార వర్గాల సమాచారం.