సిటీబ్యూరో, జూన్ 1, (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో ఓ అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ పట్టణ ప్రాథమిక కేంద్రం (యూపీహెచ్సీ) 13 నెలలుగా అద్దె చెల్లించలేదన్న కారణంగా విద్యుత్ సరఫరా కట్ చేయడంతో పాటు ఖాళీ చేయాలంటూ యజమాని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. దాంతో అక్కడి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నారు. ఈ సమస్య కేవలం జూబ్లీహిల్స్ డివిజన్లో మాత్రమే లేదు. హైదరాబాద్ జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రతి యూపీహెచ్సీలో ఇదే సమస్య వెంటాడుతోంది.
సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే వైద్య సేవలందిస్తున్న యూపీహెచ్సీలకు ప్రభుత్వం సకాలంలో అద్దె చెల్లించని కారణంగా.. భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దాఖలాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా పన్నెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఓనర్లు ఇబ్బందులు పెట్టడం మూలంగా వైద్యసేవలందించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఏడాది మొత్తం అద్దె ఒకేసారి చెల్లించినా, కాంగ్రెస్ సర్కార్ మాత్రం అద్దెలు చెల్లించకుండా చోద్యం చూస్తోంది.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంచేందుకు కేసీఆర్ సర్కార్ వైద్యరంగానికి పెద్దపీట వేసి బస్తీ దవాఖనాలు, యూపీహెచ్సీలల్లో మెరుగైన సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. సొంతభవనాలు లేనివాటికి సకాలంలో అద్దె చెల్లించి వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పర్యవేక్షించింది. హైదరాబాద్ జిల్లాలో సుమారు 85 యూపీహెచ్సీలు ఉండగా వాటిలో పలు ప్రాంతాల్లోని యూపీహెచ్సీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో కొన్నింటికి అద్దెలు చెల్లించగా సుమారు 10 యూపీహెచ్సీలకు గత ఏడాదికాలంగా అద్దెలు చెల్లించడంలేదు. వాటిలో ఒక్కో యూపీహెచ్సీకి సుమారు రూ.4లక్షల అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే వాటిని చెల్లించకపోడం మూలంగా భవనాల యజమానులు అక్కడ పనిచేసే సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. చివరికి చేసేదేమి లేక తాళాలు వేయడం..విద్యుత్ కట్ చేయడంవంటి చర్యలకు పూనుకుంటున్నారు. దీనివల్ల రోగులకు వైద్యసేవలందక ఆస్పత్రి సిబ్బంది నానా యాతన పడుతున్నారు.
వైద్య రంగానికి 2025 బడ్జెట్లో సరైన ప్రధాన్యతనిచ్చామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అద్దెలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. అసలు నిధులు విడుదల చేశారా? లేదా అనే అనుమానాలు సైతం ఉత్పన్నం అవుతున్నాయి. యూపీహెచ్సీలకు కూడా అద్దెలు చెల్లించలేని ప్రభుత్వ తీరుపై సామాన్యులు సైతంవిమర్శలు చేస్తున్నారు. వాటికి త్వరగా అద్దె చెల్లించి వినియోగంలోకి తీసుకురావాలని వైద్యారోగ్య అధికారులను కోరుతున్నారు.