సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కేవలం శంకుస్థాపనలు, చర్చలకే పరిమితమైంది. ఇప్పటికీ రక్షణ శాఖ నుంచి తీసుకోవాల్సిన భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. కనీసం రక్షణ శాఖకు ఇవ్వాల్సిన పరిహార భూములను కూడా హెచ్ఎండీఏ వెతికి పట్టుకోలేకపోయింది. దీంతో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టుల శిలాఫలకాలన్నీ దుమ్ము కొట్టుకుపోతున్నాయే తప్ప.. ప్రాజెక్టు పనులు మొదలయ్యే పరిస్థితి లేకుండాపోయింది.
ఉత్తర తెలంగాణకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం పారడైజ్ నుంచి కొంపల్లి వరకు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లను డిజైన్ చేసింది. రక్షణ శాఖతో భూ బదలాయింపు జరగకపోవడంతో ఖరారు చేసిన డిజైన్లను కార్యాచరణలోకి తీసుకురాలేకపోయారు. సీఎం రేవంత్రెడ్డి ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదించినా.. ఇప్పటికీ భూ బదలాయింపుల కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు 113 ఎకరాల కు పైగా రక్షణ శాఖ భూములు కోల్పుతుందనే అంచనాలు ఉండగా… ఇందుకు పరిహారంలో ఓఆర్ఆర్ అవతల భూములను ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. దీనికి తగినట్టుగానే హెచ్ఎండీఏ అధికారులు కూడా భూముల కోసం వెతికి అలసిపోయారు. దీంతో ఈ ప్రాజెక్టులకు అవసరమైన పరిహార భూముల అన్వేషణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మారింది.
అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా… ఇప్పటికీ పరిహార భూముల కోసమే రక్షణ శాఖతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రక్షణ శాఖ నుంచి పూర్తి స్థాయి క్లియరెన్స్ వచ్చినా… గుర్తించిన భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి, స్వాధీనం చేసుకోవడానికి మరో ఏడాది సమయం పట్టేలా ఉందని తెలిసింది.ఈ నెల 14న మరోసారి రక్షణ శాఖ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం.