North City | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): నార్త్ సిటీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆ ప్రాంతం తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అంటూనే రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న నార్త్ సిటీ ప్రాంతానికి తీరని అన్యాయం చేసేలా ఎలివేటెడ్ డబుల్ డెక్కర్, మెట్రో విషయంలో ప్రతిపాదనలను సర్కారు తారుమారు చేస్తున్నది. ఒకవేళ ఆయా ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించకపోతే నార్త్ సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకే ప్రమాదం పొంచి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డికి ‘ఊహానగరం’పై ఉన్న ప్రేమ… నార్త్ సిటీపై లేకుండా పోయింది. రాజకీయ పునర్జన్మనిచ్చిన ప్రాంతానికి అన్యాయం చేసేలా రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన ఎలివేటెడ్ కారిడార్, మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ సిటీ ప్రజల సుదీర్ఘ కాలంగా తీరని ఆకాంక్షగా ఎలివేటెడ్ కారిడార్, మెట్రో మిగిలిపోయేలా ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ భూ సేకరణ పూర్తి చేయకపోగా, తాజాగా మెట్రో నిర్మాణంలోనూ డీపీఆర్ పూర్తిచేయకుండా కొర్రీలు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకే పిల్లర్‌పై రెండు రవాణా వ్యవస్థలను తీర్చిదిద్దాలని ప్రతిపాదనలకు తిలోదకాలు వదిలే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
నిర్ణీత గడువులోగా డీపీఆర్ పూర్తి చేయకుండా, అదేవిధంగా జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం స్థానికుల ప్రతిపాదనలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా గ్రామ సభల పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారే తప్ప … చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇలా ప్రాజెక్టుల ఆశయాలను నీరుగారేలా చేసి నార్త్ సిటీ ప్రాంతానికి కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
గేట్ వే ఆఫ్ నార్త్ తెలంగాణగా పిలిచే ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను తీసుకునేలా కేంద్రంతో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనేకసార్లు సంప్రదింపులు కూడా చేశారు. కేంద్రం భూముల విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదనలను బుట్ట దాఖలు చేసింది.దాదాపు నాలుగున్నరేళ్ల పాటు తమకు రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని కోరిన ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత ప్రతిపాదనలకి మళ్లీ అంగీకారం తెలుపుతూ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై చర్యలు తీసుకుంది.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడింది అనుకునేలోపే మరో తిరకాసుతో కొర్రీలు పెడుతూ భూ బదలాయింపును జాప్యం చేస్తున్నది. ఇలా ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుండగా, భూ సేకరణ విషయంలో కూడా బాధితులతో సంప్రదింపులు చేయకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దీంతో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని, ప్రభుత్వం ప్రాజెక్టు వెడల్పు తగ్గిస్తే గాని భూములు ఇవ్వలేమని రాజీవ్ రహదారి స్థలాల జేఏసీ చెబుతున్నది. ఈ క్రమంలో ఎలివేటెడ్ కారిడార్ విషయంలో తమకు నష్టం జరగకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలా సామరస్యంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును సర్కారు వివాదాస్పదం చేసింది.
ఒకే ప్రాజెక్టు ద్వారా ఎలివేటెడ్, మెట్రో రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. రెండు మార్గాల్లో 18 కిలోమీటర్ల పొడవైన ఒకే పిల్లర్ పై రెండు రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు, భూసేకరణ భారం కూడా తగ్గుతుంది. ఇలా బృహత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌కి ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగానే నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కొర్రీలు పెడుతూ ఆ ప్రాజెక్టును రెండుగా విడదీసి నార్త్ సిటీ ప్రయోజనాలకు గండి కొట్టాలని భావిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా ఎలివేటెడ్ కారిడార్, మెట్రో పనులు పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.