Medchal | మేడ్చల్, జనవరి11(నమస్తే తెలంగాణ): నిధుల లేమితో శివారు మున్సిపాలిటీలు వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరీలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో మున్సిపాలిటీల పరిధిలో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలు ఫిర్యాదులు చేసినా.. సమస్యలు పరిష్కరించేందుకు నిధుల సమస్య ఏర్పడుతున్నది.
దీంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్యలు రాకుండా ఉండేందుకు వంద శాతం ఆస్తిపన్నుల, ట్రెడ్ లైసెన్స్‌ల ద్వారా ఆదాయం పెంచుకునేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో వంద శాతం పన్నుల వసూళ్లు, ట్రెడ్ లైనెన్స్ల ద్వారా ఆదాయాన్ని పెంచేలా దృష్టి సారిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో అనేక వ్యాపారాలు సముదాయాలు ట్రెడ్ లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అయితే ట్రెడ్ లైసెన్స్‌లు లేని వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ అధికారులు తనిఖీలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే వ్యాపార సముదాయాలు ట్రెడ్ లైసెన్స్‌లు తీసుకోకుండా ఉండటం మూలంగా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం కోల్పోతున్నది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మున్సిపాలిటీలను నిధులు మంజూరు చేయకపోవడంతో ట్రెడ్ లైసెన్స్‌ల ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారు.
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు 34 గ్రామ పంచాయతీలలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 182 కోట్ల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు పన్ను వసూళ్లలో 60 శాతం మాత్రమే వసూళ్లు జరిగాయి. మున్సిపాలిటీలలో రూ. 172 కోట్లు ఉండగా, గ్రామ పంచాయతీల్లో రూ. 10,76 కోట్లు ఉన్నాయి. మున్సిపాలిటీలలో నిధుల లేమితో తప్పని సరిగా ఆస్తిపన్ను, ట్రెడ్ లైసెన్స్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. మున్సిపాలిటీలలో కనీస అవసరాలను కల్పించేందుకైనా ఆస్తిపన్నుల, ట్రెడ్ లైసెన్స్‌లపై మున్సిపాలిటీలు ఆధారపడాల్సి వస్తున్నది. ఏదీ ఏమైనా నిధుల లేమితో మున్సిపాలిటీల అభివృద్ధి జరగడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.