సైదాబాద్, అక్టోబర్ 28 : మలక్పేట ప్రభుత్వ దవాఖానలోని డయాలసిస్ కేంద్రాల్లో సర్కారీ వైద్యం గ్రేట్ అనిపించుకుంటుంది. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల రోగుల కోసం ప్రత్యేక శ్రద్ధపెట్టి చర్యలు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను చూసిన ప్రజలు దవాఖానలకు వస్తుండటంతో రోగుల సంఖ్య పెరిగింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ప్రభుత్వం పించన్, సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్తో సేవలు అందిస్తుండటంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మలక్పేట వాసులకు ..
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేద, మద్య తరగతి రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తూ మలక్పేట డయాలసిస్ కేంద్రం భరోసా కల్పిస్తుంది. మలక్పేట దవాఖాన కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తే రోగుల మన్ననలు పొందుతుంది. మలక్పేట ఏరియా దవాఖానలో 2017 అక్టోబర్లో అత్యధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటుచేసిన సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్ డయాలసిస్ సెంటర్ కిడ్నీ రోగులకు వరంగా మారింది.
రికార్డు స్థాయిలో డయాలసిస్..
2017లో 70 మందికి, 2018లో 3,707 మందికి, 2019లో 5,494 మందికి, 2020లో 6,833 మందికి, 2021లో 6,574 మందికి, 2022లో 1,558 మందికి, 2023 ఇప్పటి వరకు 7,794 మందికి సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్తో డయాలసిస్ సేవలను అందించారు. 2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 32,040 మందికి మలక్పేట సర్కార్ దవాఖానలో ఉచితంగా డయాలసిస్ సేవలను అందించటం జరిగింది. జర్మనీ కంపెనీ తయారుచేసిన డిమేడ్ టర్కీ టెక్నాలజీతో రూపొందించిన జపాన్ అడ్వాన్స్డ్ నెప్రో డయాలసిస్ యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. పది మిషన్లు 24 గంటలు అందుబాటులో ఉండటంతో ఒకేసారి100 మందికి డయాలసిస్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉన్నది. రోజుకు 36 మందికి తగ్గకుండా డయాలసిస్ చేస్తున్నారు. గతనెలలో రికార్డు స్థాయిలో 910 మందికి డయాలసిస్ చేసి చరిత్ర సృష్టించారు ఇక్కడి సిబ్బంది.
పించన్ పెంచుతే బాగుంటది..
ప్రభుత్వం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగుల కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తుంది. ఉచితంగా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్తో డయాలసిస్ సేవలను అందిస్తుందుకు సంతోషంగా ఉంది. ప్రైవేట్లో వైద్యం కోసం ఉన్న స్థిరాస్తులను అమ్ముకోవటమో, అప్పులు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితుల నుంచి ప్రభుత్వం విముక్తి కల్పించింది. వైద్యులు, సిబ్బంది అందిచే సేవలు మంచిగా ఉన్నాయి. మాలాంటి పేదోళ్ల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నా సర్కార్ను మేం మరిచిపోలేం. కిడ్నీ రోగులకు ప్రస్తుతం అందిస్తున్న పించన్ పెంచుతే బాగుటుందని, సీఎం కేసీఆర్ సార్ను కోరుతున్నా.
– జెర్రిపోతుల మాధురి, నాగోల్
పైసా ఖర్చులేకుండా డయాలసిస్ ..
రెండేళ్లుగా పైసా ఖర్చులేకుండా డయాలసిస్ చేయించుకుంటున్నా. ప్రైవేట్ దవాఖానల్లో చేయించుకుంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుండే. ఇప్పడు బాధ తప్పింది. సీఎం కేసీఆర్ సార్ మంచిగా చేసుండ్రు. మాలాంటి పేదోళ్లకు వచ్చిన రోగానికి డబ్బులు లేక చాల ఇబ్బందులు పడుతున్నాం. సర్కారీ దవాఖానలో డయాలసిస్ ఉచితంగా చేస్తుండటంతో ఆ బాధలను తప్పినాయి. ప్రైవేట్ దవాఖానలో కంటే ఇక్కడే చాలా మంచిగా చేస్తుండటంతో ఇక్కడి వచ్చి చేయించుకుంటున్నాను. సీఎం కేసీఆర్ సార్ పైసా ఖర్చులేకుండా ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తుండటంతో పేద వారికి ప్రభుత్వం అండగా ఉందనిపిస్తుంది.
– సోనగంటి వెంకట్ చారి, తుర్కయంజాల్
కిడ్నీ రోగులకు మెరుగైన సేవలు..
మలక్పేట ప్రాంత ప్రజలందరికీ సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టమ్ ఉయాలసిస్ సెంటర్ అందుబాటులో ఉండటంతో అనేక మంది కిడ్నీ రోగులు ఉచితంగా ఉపయోగించుకుంటున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నాం. అధిక సంఖ్యలో రోగులకు సేవలను అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నాం. ఎక్కడాలేని విధంగా సర్కార్ దవాఖానలో అత్యాధునీక టెక్నాలజీ కలిగిన పది మిషన్ల ద్వారా రోగులకు డయాలసిస్ సేవలను అందిస్తుండటంతో వివిధ ప్రాంతాలనుంచి బాధితులు వస్తున్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించటమే లక్ష్యంగా ముందుకెళ్తాన్నాం.
– డాక్టర్ త్రిలోక్ శ్యామ్, మలక్పేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్