Land Grabbing | మేడ్చల్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో కబ్జాలకు గురైన భూముల వివరాలను సేకరించి నివేదికలను స్థానిక మండలాల తహసీల్దార్లు తయారు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న సర్వే నంబర్లలో కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారి పేర్లతో పాటు ఎంత భూమి ఆక్రమణకు గురైన వివరాలను తహసీల్దార్లు సేకరించినట్లు సమాచారం.
జిల్లాలో సుమారు 3 వందల సర్వే నంబర్లలో 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఐదు నియోజకవర్గాల్లోని మండలాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం బాలానగర్ మండలంలో 700 ఎకరాలు, శామీర్‌పేట మండలంలో 420, దుండిగల్ మండలంలో 425, మేడిపల్లి మండలంలో 900, ఘట్కేసర్ మండలంలో 500, కాప్రా మండలంలో 400, కీసర మండలంలో 600, బాచుపల్లి మండలంలో 360, కుత్బుల్లాపూర్ మండలంలో 600, ఉప్పల్ మండలంలో 333, మల్కాజిగిరి మండలంలో 113, మేడ్చల్ మండలంలో 37 ఎకరాలు ఉన్నాయి.
కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో స్థానిక తహసీల్దార్లు తయారు చేసిన జాబితాలో ఎంత ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన లెక్క తేలినట్లు తెలుస్తున్నది. వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు..? ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారు..? అన్నది వేచి చూడాల్సిందే.
ధన, అధికార బలమున్న పెద్దలకు అధికారులు తలొగ్గుతున్నట్లు తీవ్రమైన ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే కబ్జాలు చేసే రాజకీయ పెద్దలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. దీంతో భూ పరిరక్షణ పెద్ద టాస్క్‌గా మారింది.