బంజారాహిల్స్,ఏప్రిల్ 23: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. కొంతమంది తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ప్రహరీలు, గార్డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. మరికొంతమంది నిబంధనలను తుంగలో తొక్కి ఖాళీ స్థలాలను జీవో 59కింద క్రమబద్దీకరించుకున్నట్లు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే కాలనీగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర హౌజ్ బిల్డింగ్ సొసైటీ పెద్దలు ఇష్టారాజ్యంగా లే అవుట్లను మార్చేసి ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలను ప్లాట్లుగా చూపించి అమ్ముకున్న సంగతి తెలిసిందే. గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి హయాంలో పెద్ద సంఖ్యలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
అనంతరం సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సిద్దయ్య కూడా తానేమీ తీసిపోనన్న చందంగా కొన్ని స్థలాలను ప్లాట్లుగా అమ్మినట్లు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాలనీలోని ప్లాట్ నెం 37నుంచి ఏసీబీ కార్యాలయం దాకా లేన్‌లో సుమారు 20 నుంచి 25 ఇండ్ల యజమానులు తమ ఇంటి వెనకాల ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలంలోకి చొచ్చుకువెళ్లారని తేలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పకడ్బందీగా ఫెన్సింగ్ పనులు చేయిస్తున్న షేక్‌పేట మండల అధికారులు స్థలంలోకి వచ్చిన ఆక్రమణలను చూసి షాక్‌కు గురవుతున్నారు. సుమారు 15మందికి పైగా ఇండ్ల వెనుకభాగంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని తేల్చారు. వీరిలో కొంతమంది తాము గతంలో జీవో 59 కింద క్రమబద్దీకరణ చేయించుకున్నామని పత్రాలు చూపించారు.
ఖాళీ స్థలాలను జీవో 59 కింద క్రమబద్దీకరణ చేయడానికి వీలులేదు. ఆక్రమిత స్థలంలో సుమారు 70శాతం పైగా నిర్మాణాలు ఉంటేనే క్రమబద్దీకరణ చేయాల్సి ఉంటుంది. కాగా ఎమ్మెల్యే కాలనీలో జీవో 59 కింద జరిగిన క్రమబద్దీకరణలో నిబంధనలకు తూట్లు పొడిచినట్లు తేలింది. సర్వెంట్ రూమ్స్ గార్డెన్, ప్లే ఏరియాతో పాటు కొన్ని ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాలను కూడా స్థానిక రెవెన్యూ అధికారులు క్రమబద్దీకరించినట్లు తెలుస్తోంది. సుమారు ఎకరం స్థలానికి పైగా స్థలంలో ఆక్రమణలు ఉన్నాయని గుర్తించిన షేక్‌పేట మండల అధికారులు కొన్నింటిని కూల్చేయగా, మరికొన్ని ఆక్రమణలపై నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి అక్రమంగా జీవో 59 కింద క్రమబద్దీకరణ చేయించుకున్న ఖాళీ స్థలాలను.. ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యే కాలనీలోని శ్రీ వెంకటేశ్వర హౌజ్ బిల్డింగ్ సొసైటీలో చోటు చేసుకున్న అవకతవకలపై గతంలోనే విజిలెన్స్ విచారణ జరిగింది. కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఆక్రమణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.