బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీలో ఉన్న సుమారు 900 గజాల ప్రభుత్వ స్థలాన్ని మువ్వా రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఈ స్థలం తనదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా.. ఏకంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను తప్పుదోవ పట్టించి నిర్మాణ అనుమతులు కూడా తీసుకున్నాడు. కాలనీవాసుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు రవీంద్రనాథ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అయినప్పటికీ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలోనే ఉంచుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల మరోసారి కాలనీవాసులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయడంతో గురువారం కలెక్టర్ శర్మన్ స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. యూఎల్సీ ల్యాండ్ అని రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని షేక్‌పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో తక్షణమే అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో పాటు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.18కోట్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది వద్దకు ఓ వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ స్థలం తమ యజమానిదని, కూల్చివేతలు ఆపాలని హెచ్చరించాడు. అయితే ప్రభుత్వం స్థలాన్ని కబ్జా నుంచి కాపాడుతున్నామని, ఏదైనా ఉంటే అధికారులతో చెప్పుకోవాలని సిబ్బంది తేల్చి చెప్పారు.