హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): హన్మకొండ జిల్లా పరకాల గ్రామానికి చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శ వర్షిణిదే పూర్తి బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల సంఘం మండిపడింది. ఎస్సీ గురుకులంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులను అకారణంగా నడిరోడ్డున పడేశారని, ఫలితంగా దిక్కుతోచని స్థితిలో మానసిక వేదనకు గురవుతూ అనేక మంది అనారోగ్యానికి గురై ప్రాణాలను విడిచే పరిస్థితి వచ్చిందని వివరించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఏ సొసైటీలో లేనివిధంగా కేవలం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సొసైటీ కార్యదర్శి వర్షిణి జీవో 1274 అమలు పేరిట గత 16 సంవత్సరాలుగా సేవలందిస్తూ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న 2వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులు, సిబ్బందిని ఒక్కసారిగా విధుల నుంచి తొలగించారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుటుంబాలు రోడ్డున పడటంతో తాత్కాలిక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా నిరుకుల్ల మండలం ఆత్మకూరు గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు హర్షం కుమారస్వామి తీవ్ర మానసిక వేదన గురై ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారని వివరించారు. ఏళ్లుగా సేవలను అందించిన తాత్కాలిక ఉపాధ్యాయులపై సర్కారు కక్షకు ఇది నిదర్శనమని వివరించారు. తాత్కాలిక ఉపాధ్యాయుల మృతికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, కార్యదర్శిలదే పూర్తి బాధ్యతని తెలిపారు. ఇకనైనా విధుల నుంచి తొలగించిన తాత్కాలిక ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని తాత్కాలిక ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఇదే విషయమైన ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించేందుకు సంఘం నేతలు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించలకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.